Instagram Fraud| ఎన్ఆర్ఐ సంబంధాల పేరిట మోసం
- ముగ్గురు యువతులకు కుచ్చుటోపీ
- రూ.12 లక్షల నగదు, తులం బంగారం కాజేసిన యువకుడు
- పోలీసుల అదుపులో నిందితుడు
టేక్మాల్, ఆంధ్రప్రభ: విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలతో వివాహాలు జరిపిస్తానని ఇన్స్టాగ్రామ్ ద్వారా ముగ్గురు యువతులను నమ్మించి రూ.12 లక్షల నగదు, తులం బంగారం కాజేసిన ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఓ యువతి, ఇద్దరు మైనర్ బాలికలకు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేష్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కుమారుడు తన స్నేహితుడని, అతని స్నేహితులు విదేశాల్లో స్థిరపడ్డారని నమ్మించాడు. ఇద్దరు యువతులకు విదేశాల్లో ఉన్న యువకులతో వివాహ సంబంధాలు కుదురుస్తానని, మరో యువతికి కానిస్టేబుల్‌తో వివాహం జరిపిస్తానని హామీ ఇచ్చి వారి నుంచి రూ.12 లక్షల నగదు, తులం బంగారం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొంతకాలం తర్వాత దుర్గేష్ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు తమ తల్లిదండ్రులతో కలిసి టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీస్ స్టేషన్లోనే రాజీ..?
ఈ కేసులో నిందితుడిని కోర్టులో హాజరుపరచకుండా, ఇరువర్గాల పెద్దల సమక్షంలో పోలీస్ స్టేషన్లోనే రాజీ కుదిర్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బాధితులకు రూ.6 లక్షలు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. అయితే మిగిలిన రూ.6 లక్షలు, తులం బంగారం ఏమయ్యాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పంచాయతీ పెద్దలు, పోలీసుల పాత్రపై కూడా స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు స్టేషన్లోనే రాజీకి ప్రయత్నించడం సరైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

