NIA | గాదె ఇన్నయ్యపై చార్జ్‌షీట్..
- ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలు
- యూఏపీఏ కేసులో గాదె ఇన్నయ్యకు కొత్త చిక్కులు
- నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ఎన్ఐఏ, గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించింది. గతేడాది (2025) అక్టోబర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కథా రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా గాదె ఇన్నయ్య చేసిన ప్రసంగం మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉందని ఎన్ఐఏ పేర్కొంది. “విప్లవం చనిపోకూడదు” వంటి వ్యాఖ్యలతో సుమారు 200 మందిని మావోయిస్టు సిద్ధాంతాల వైపు ప్రేరేపించినట్లు ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో పలువురు సీనియర్ మావోయిస్టు నాయకులతో ఇన్నయ్య సమావేశమైనట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఎన్ఐఏ తెలిపింది. అలాగే ‘భారత్ బచావో’ అనే ఫ్రంటల్ సంస్థ ద్వారా మావోయిస్టు భావజాల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు ఆరోపించింది. మావోయిస్టు నేతల అంత్యక్రియల వేదికలను సిద్ధాంత ప్రచారానికి వినియోగించినట్లు కూడా పేర్కొంది. ఈ కేసులో గాదె ఇన్నయ్యను 2025 డిసెంబర్ 21న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం అనారోగ్య కారణాల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈ నెల 5న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిషేధిత సంస్థల భావజాల వ్యాప్తికి కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపిన ఎన్ఐఏ, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
