కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న గిరిజన సంఘాలు
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ: జిల్లాలోని ఇసుక క్వారీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండలంలోని పలు గిరిజన సంఘాలు, నాయకులు గురువారం వాడగూడెంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, గిరిజన ఇసుక సొసైటీల ద్వారా ఉపాధి పొందుతూ గిరిజనులు ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో వారి అభివృద్ధిని అడ్డుకోవడం కేటీఆర్‌కు తగదన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో జరిగిన ఇసుక దోపిడీపై స్పందించని కేటీఆర్, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడుతున్న ఇసుక క్వారీలపై వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ఇసుక క్వారీలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇసుక వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలని, ఎక్కడైనా ఒక టన్ను ఓవర్‌లోడ్ వెళ్తుందా, ఎక్కడైనా అక్రమ వ్యాపారం జరుగుతుందా అనేది ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ వేలాది మంది గిరిజనుల ఉపాధిపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో పారదర్శకంగా ఇసుక రవాణా జరుగుతోందని, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.ఎవరో చెప్పిన మాటలు విని ఒక ప్రధాన రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, ఆధారాలు లేకుండా మాట్లాడటం రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరమని హెచ్చరించారు.
ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

