TG | ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి..
TG | ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి..
- గ్రామీణ కూలీల ప్రయోజనాలే లక్ష్యం
TG | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త వీబీజీ రామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించినట్లు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వెల్లడించారు. కొత్త పథకం అమలుతో గ్రామీణ కూలీలు, రాష్ట్ర ప్రభుత్వంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామిలతో ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మెట్రో ఫేజ్-2కు కేంద్రం సహకరించాలి
హైదరాబాద్ నగర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ అత్యంత కీలకమని సమావేశం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరింది. అలాగే ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి రావాల్సిన రుణాన్ని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని మంత్రులు కోరారు.
నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు తెలంగాణలో సుమారు 208 పరీక్షా కేంద్రాల్లో 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని సమావేశం నిర్ణయించినట్లు మంత్రులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
