గాదె సాయికృష్ణ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి..
గాదె సాయికృష్ణ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి..
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
మాజీ మంత్రి అంబటి రాంబాబు
కృష్ణలంక, ఆంధ్రప్రభ : గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అన్నారు. సాయికృష్ణ కుటుంబాన్ని ఇలాంటి విషాద సమయంలో పరామర్శించడం బాధాకరమని పేర్కొన్న ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత హృదయ విదారకమైన విషయాలు తెలిసాయని చెప్పారు. వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయో ఈ ఘటన వెల్లడిస్తోందని విమర్శించారు.
ఫిర్యాదులు చెత్తబుట్టలో పడ్డాయి..
సాయికృష్ణను గుర్తించి తీసుకువచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు పలుమార్లు పోలీసులను వేడుకున్నప్పటికీ స్పందన లేదని అంబటి ఆరోపించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న దుర్గ ఇచ్చిన ఫిర్యాదు డీజీపీ నుంచి సీపీ, అక్కడి నుంచి డీసీపీ కార్యాలయానికి వెళ్లి చివరకు చెత్తబుట్టలో పడిందని విమర్శించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇతర నిందితుల ద్వారా సాయికృష్ణ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసిందని, హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయకుండా కూడా ఇబ్బందులు సృష్టించారని అన్నారు.
సాయికృష్ణకు న్యాయం జరగాలి..
సాయికృష్ణపై క్రిమినల్ సామ్రాజ్యం ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, అది నిజమైతే ఆయన తల్లి దయనీయ పరిస్థితుల్లో జీవించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నేర ఆరోపణలు ఉన్న వ్యక్తికైనా చట్ట ప్రక్రియ ప్రకారం విచారణ జరపాల్సిందేనని, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. సాయికృష్ణకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా కుటుంబానికి ఇవ్వలేదని ఆరోపించారు. ఆయనను దారుణంగా హత్య చేసి, అనంతరం ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.
సీపీ నుంచి కానిస్టేబుల్ వరకు బాధ్యత నిర్ధారించాలి..
ఈ ఘటనలో కానిస్టేబుల్ నుంచి పోలీస్ కమిషనర్ వరకు ఎవరి పాత్ర ఉన్నా బయటపడాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సీపీ, డీజీపీ, హోంమంత్రికి తెలియకుండా ఇలాంటి ఘటనలు జరగవని ఆరోపించారు. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి కలిగి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. తూతూమంత్రంగా విచారణాధికారిని నియమించి చేతులు దులుపుకోవడం సరిపోదన్నారు. సాయికృష్ణ కుటుంబం ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదని, అయినప్పటికీ మానవతా దృక్పథంతో వారి వెంటే నిలుస్తామని చెప్పారు. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
