JUNE30TH | నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

JUNE30TH | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: వానాకాలం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే రైతు సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

గురువారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి వివరించారు. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏడు రకాల సన్న బియ్యం రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

తెలంగాణ నుంచి కేంద్రం తక్కువ ధాన్యం సేకరిస్తోందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైందని, రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అలాగే ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసినట్లు తెలిపారు.

రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో అధిక వాటాను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు, నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రావాల్సిన రుణాన్ని త్వరగా విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలని బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చిన మంత్రి, ఇకపై డిజిటల్ కేబినెట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే వీబీ-జీ ఆర్‌ఏఎం జీ అంశంపై అధ్యయనం కోసం మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.