నకిలీ వరి విత్తనాల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకోవాలి
- నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో నకిలీ వరి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత విత్తన కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు డిమాండ్ చేశారు.
గురువారం ఇటుకాలపల్లి గ్రామంలో నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ, వివిఆర్ ధనుక విత్తన కంపెనీ ప్రతినిధులు సుమారు 20 మంది రైతులతో 40 ఎకరాల్లో ఆడ-మగ వరి విత్తనాల సాగు చేయించారని తెలిపారు. ఎకరానికి 12 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి వస్తుందని, దిగుబడిని క్వింటాకు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అయితే కంపెనీ సూచనల మేరకు సాగు చేసినప్పటికీ ఎకరానికి కేవలం 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఎకరానికి రూ.70 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నప్పటికీ, కంపెనీ ప్రతినిధులు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం విత్తన కంపెనీలపై సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే రైతులు ఇలాంటి మోసాలకు గురవుతున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.కె. అన్వర్ పాషా, గోనె మల్లారెడ్డి, పెండ్యాల సారయ్య, విత్తన సాగుదారులు బొడిగె శ్రీనివాసు, ఎస్.కె. రహీం, పిట్టల రవి, బూర రాజు, కందికొండ రాజు, గోనె పెద్ద మల్లయ్య తదితర రైతులు పాల్గొన్నారు.
