ఒకే వేదికపై అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు..
ఒకే వేదికపై అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు..
ప్రత్యేక యోగా వెనుక ఉద్దేశమేంటి?
ధీమాటిక్ యోగాలో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు
కర్నూలు, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఎస్‌ఏపీ క్యాంపు ఆవరణలో నిర్వహించిన ధీమాటిక్ యోగా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు చేస్తూ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్యకర జీవనశైలికి యోగా ఉత్తమ మార్గమని వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. యోగా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి బాటలు వేస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు తమ విధుల్లో ఎదుర్కొనే శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
