KeyDecision | తెలంగాణలో ఇక డిజిటల్ కేబినెట్..
KeyDecision | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: సాంకేతికతను పాలనలో మరింత విస్తృతంగా వినియోగించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా డిజిటల్ విధానంలో, పేపర్‌లెస్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణ కేబినెట్ సమావేశాలకు కొత్త రూపు రానుంది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తాజా మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. సమావేశానికి ముందు అధికారులు లేకుండా కేవలం మంత్రులతోనే సీఎం ప్రత్యేకంగా చర్చలు జరిపి డిజిటల్ కేబినెట్ విధానంపై అవగాహన కల్పించారు.

ఈ కొత్త విధానంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. ఇకపై మంత్రివర్గ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, ప్రతిపాదనలు, నివేదికలు అన్నీ ఈ-బుక్ రూపంలో నేరుగా ఆయా ట్యాబ్‌లలో అందుబాటులోకి రానున్నాయి.
పేపర్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను మరింత వేగవంతం చేయడం, సమాచార భద్రతను పెంచడం, పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇప్పటికే ఈ వ్యవస్థ అమలుకు సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

డిజిటల్ కేబినెట్ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆధునిక సాంకేతికత ఆధారిత పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వేగవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పరిపాలన కోసం డిజిటల్ విధానాల వినియోగాన్ని మరింత విస్తరించనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
