భారత నావికుల భద్రత మాకు చాలా ప్రాధన్యం..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లే-బెయిన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు రెండో రోజు ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులపై కీలక చర్చలకు వేదికగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి వంటి అంశాలు ప్రధాన అజెండాగా నిలిచాయి. జూన్ 15న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు (17న) ముగియనుంది. కాగా, ఈ సదస్సులో ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా దేశాల నేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు.
‘కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం’ అనే అంశంపై జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోడీ, హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సముద్ర రవాణా రంగం తీవ్ర ప్రభావానికి గురైందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఉక్రెయిన్‌పై నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచాలని జీ7 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యా ఒక ఒప్పందానికి రావాలి అని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా చమురుపై ఆంక్షలను తిరిగి అమలు చేసే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
సదస్సు సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరింత మద్దతు అందించే అంశంపై చర్చించారు. అనంతరం కెనడా ప్రభుత్వం రష్యా ఇంధన ఆదాయాలు, రక్షణ రంగం, రహస్య నౌకాదళ కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించింది.
ఇదిలా ఉండగా, కాంగో ప్రజాస్వామ్య గణరాజ్యంలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా మహమ్మారిపై కూడా జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వ్యాధి ఇంకా గరిష్ఠ స్థాయికి చేరలేదని రెడ్ క్రాస్ హెచ్చరించిన నేపథ్యంలో, ఎబోలాను ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన బలమైన అంతర్జాతీయ చర్యలు అవసరమని జీ7 నేతలు అభిప్రాయపడ్డారు.
