Trump | మోడీ నా చిరకాల మిత్రుడు..
- భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు
- అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతున్న భారత్‌కు ప్రశంసలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)పై ప్రశంసలు కురిపించారు. మోడీతో చాలా సానుకూల చర్చలు జరిగాయని, భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జీ7 సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్… ప్రధాని మోడీతో చాలా మంచి చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికాలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాం. భారత్ కూడా అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. మోడీ అమెరికాలో చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని అన్నారు.
మోడీ తనకు చాలా కాలంగా సన్నిహిత మిత్రుడని, తమ మధ్య ఎప్పుడూ మంచి సంబంధాలే కొనసాగాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. మోడీ చాలా కాలంగా నా స్నేహితుడు. మేమిద్దరం ఎప్పుడూ అద్భుతమైన సంబంధాలు కొనసాగించాం. ఆయనతో కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.
జీ7, జీ20 సమావేశాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా భావిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా సహకారం రాబోయే కాలంలో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
