నకిలీ విత్తన వ్యాపారిపై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

  • నిందితుడు ఏపీకి చెందిన వూస సుబ్బారావు
  • రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ అమాయక రైతులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర వ్యాపారిపై బుధవారం పీడీ చట్టం (ప్రివెంటివ్ డిటెన్షన్) అమలు చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావు మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని తాండూర్, భీమిని, భీమారం, నెన్నెల, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకుని నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు.

గతంలో 2021లో ఇతనిపై పీడీ చట్టం అమలు చేసినప్పటికీ.. జైలు నుంచి వచ్చాక కూడా ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నకిలీ విత్తనాల దందా మొదలుపెట్టాడు. రెండు జిల్లాల పరిధిలో ఇతనిపై మొత్తం 9 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు ఈ ఏడాదిలోనే రెండు సార్లు పట్టుబడ్డాడని, రైతుల జీవితాలతో ఆడుకుంటున్న నిందితుడిపై సీపీ ఉత్తర్వుల మేరకు తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్‌లు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్‌లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.