త్వరలో అమరావతి ఛాంపియన్షిప్ కప్…
త్వరలో అమరావతి ఛాంపియన్షిప్ కప్…
సన్నాహాలు వేగవంతం చేస్తున్న అధికారులు..
రాష్ట్రవ్యాప్తంగా 12 క్రీడాంశాల్లో పోటీలు
జూలై 10 నుంచి నియోజకవర్గ స్థాయి ఎంపికలు
అధికారులతో శాప్ చైర్మన్ రవి నాయుడు సమీక్ష
యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ కప్-2026 పోటీల ఏర్పాట్లపై శాప్ చైర్మన్ రవి నాయుడు బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పోటీల నిర్వహణ, షెడ్యూల్, సమన్వయ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ కప్-2026ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్-17, అండర్-23 విభాగాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు జూలై 10 నుంచి 25 వరకు, జిల్లా స్థాయి పోటీలు జూలై 26 నుంచి ఆగస్టు 10 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు ఆగస్టు 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల నిర్వహణలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించిన ఆయన, నియోజకవర్గ స్థాయి పోటీల్లో స్థానిక ఎమ్మెల్యేలను, జిల్లా స్థాయి పోటీల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రులను భాగస్వాములుగా చేర్చాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని రవి నాయుడు పిలుపునిచ్చారు. సమావేశంలో శాప్ ఏవో రమావత్ వెంకటరమణ నాయక్, క్రీడా శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
