మంథని అభివృద్ధికి రూ.5.25 కోట్ల నిధులు

మంథని అభివృద్ధికి రూ.5.25 కోట్ల నిధులు

  • సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు చొరవ

మంథని, ఆంధ్రప్రభ : మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరోసారి భారీ నిధులను మంజూరు చేయించారు. నియోజకవర్గ పరిధిలోని 10 మండలాల్లో సీఆర్‌ఆర్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనుల కోసం రూ.5 కోట్ల 25 లక్షల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంథని మండలంలోని అడవిసోమన్‌పల్లి, భట్టుపల్లి, బిట్టుపల్లి, ఆరెంద, ఎక్లాస్‌పూర్, గోపాల్‌పూర్, గుంజపడుగు, గుమ్మనూరు, కన్నాల, ఖానాపూర్, ఖాన్సాయిపేట, లక్కెపూర్, మైదుపల్లి, నాగారం, నగరంపల్లి, నాగేపల్లి, పోతారం, పుట్టపాక, సూరయ్యపల్లి, ఉప్పట్ల, వెంకటాపూర్, చిల్లపల్లి గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, బెస్తపల్లి, చిన్నఓదెల, దుబ్బపల్లి, మల్లారం, మల్లేపల్లి, సిరిపురం, తోటగోపయ్యపల్లి గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు.

గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – మంత్రి శ్రీధర్ బాబు

గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, పారిశుధ్యాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ నిధుల ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.

మంత్రికి కృతజ్ఞతల వెల్లువ

నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు 10 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కృషితో మంథని నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.