ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసం ఇంటింటి సర్వే ప్రారంభం
ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసం ఇంటింటి సర్వే ప్రారంభం
ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి.. సెప్టెంబర్ 22 నాటికి తుది జాబితా: కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. పారదర్శకంగా, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
బుధవారం శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డితో కలిసి రేణిగుంట మండలం వెదుళ్లచెరువు గ్రామంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు కార్యక్రమం ఉద్దేశ్యం, విధానాలపై అవగాహన కల్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు. ఓటర్లు వాటిని పూర్తిగా నింపి బీఎల్ఓలకు నేరుగా లేదా బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) ద్వారా సమర్పించవచ్చని చెప్పారు. అలాగే ఇంటర్నెట్పై అవగాహన ఉన్నవారు ఆన్లైన్లో కూడా ఫారాలను సమర్పించే అవకాశం ఉందన్నారు.
12 రకాల గుర్తింపు పత్రాలతో నమోదు
ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హులైన వారి పేర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చుతామని కలెక్టర్ తెలిపారు. పేర్లు లేకపోవడం లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు సేకరించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ ప్రక్రియలో మరణించినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిపోయినవారు, ద్వంద్వ ఓటు నమోదులు కలిగిన వారి పేర్లను తొలగిస్తామని తెలిపారు. అదే సమయంలో 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు, నివాసం మారిన వారి ఓటును కొత్త ప్రాంతానికి బదిలీ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని వివరించారు.
ప్రతి వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని, ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
పారదర్శకంగా సర్వే నిర్వహణ
ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యంతో ఇంటింటి సర్వే కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓ లేదా జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించాలని సూచించారు.
అలాగే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఎన్నికల హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని, జిల్లాలో కచ్చితమైన, నమ్మకమైన, సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎన్నికల సిబ్బంది, బీఎల్ఓలు, బీఎల్ఏలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
