యూరియా విక్రయాల్లో అక్రమాలపై కలెక్టర్ సీరియస్
యూరియా విక్రయాల్లో అక్రమాలపై కలెక్టర్ సీరియస్
లింక్ సేల్స్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. రైతులకు అవసరమైన ఎరువులే విక్రయించాలి
కర్నూలు, ఆంధ్రప్రభ : రైతులకు యూరియా విక్రయాల పేరుతో ఇతర ఎరువులు, ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే లింక్ సేల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బుధవారం దేవనకొండ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ యూరియా దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాల విధానం, రైతుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి దుకాణ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
రైతులు తమ పంట అవసరాలకు అనుగుణంగా కావాల్సిన ఎరువులను మాత్రమే కొనుగోలు చేయాలని, యూరియా కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఇతర ఎరువులు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియాతో పాటు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినా, ప్రోత్సహించినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా లింక్ సేల్స్, అదనపు కొనుగోళ్లకు బలవంతం చేయడం లేదా యూరియా సరఫరాలో అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే రైతులు వెంటనే 155251 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 8341302863 మొబైల్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన బండగట్టు, కొంకనూరు రైతు సేవా కేంద్రాల సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా రైతుల వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విత్తన, ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
