ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతులు ముందుకు రావాలి

ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రైతులు ముందుకు రావాలి
భూమిని 365 రోజులు సజీవంగా ఉంచే పీఎండీఎస్ విధానం రైతుకు లాభదాయకం
రసాయన ఎరువుల వినియోగం తగ్గించి భూసారం పరిరక్షించాలి : కలెక్టర్ పిలుపు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ఆచరించి భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు.
బుధవారం దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక షణ్ముఖ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, జీవామృతాలు, కషాయాలు, బయో ఇన్పుట్స్ తయారీ విధానాలను పరిశీలించి నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని అభినందించారు.
జిల్లాలో ప్రస్తుతం సుమారు 48,500 హెక్టార్లలో 85 వేల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, మొత్తం 3.5 లక్షల మంది రైతుల్లో మరింత మంది ఈ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య రంగాల ద్వారా జిల్లా జీడీపీలో సుమారు 42 శాతం ఆదాయం వస్తోందని పేర్కొన్నారు.
రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి నిస్సారమవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, ముఖ్యంగా డీఏపీ వినియోగంలో నంద్యాల జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరమన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటించకపోవడం, ఒకే రకమైన పంటల సాగు, ఖరీఫ్ అనంతరం భూములను ఖాళీగా ఉంచడం వంటి కారణాల వల్ల కూడా భూసారం దెబ్బతింటోందని తెలిపారు.
\text{PMDS : భూమిని 365 రోజులు పచ్చదనంతో కప్పే విధానం}
పీఎండీఎస్ విధానం ద్వారా భూమిని 365 రోజులు పచ్చదనంతో కప్పి ఉంచడంతో పాటు నేలలో సూక్ష్మజీవుల పెరుగుదల, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతాయని కలెక్టర్ వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే ప్రభుత్వం 34 రకాల విత్తనాలతో కూడిన పీఎండీఎస్ కిట్లను అందిస్తున్నదని తెలిపారు. ఈ కిట్లలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పశువులకు ఉపయోగపడే పచ్చిమేత విత్తనాలు ఉన్నాయని చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారు 11 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, పీఎండీఎస్ ద్వారా పచ్చిమేత లభ్యత పెరిగితే ఇది 16 నుంచి 17 లక్షల లీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేశారు.
ముక్కామల అపర్ణమ్మకు చెందిన పొలంలో నిర్వహించిన విత్తన గుళికల (సీడ్ పెల్లెటైజేషన్) తయారీ ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. జీవామృతం, ఘన జీవామృతంతో విత్తనాలను శుద్ధి చేసి గుళికల రూపంలో తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించారు. ఈ పద్ధతి ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
తదుపరి అదే పొలంలో పీఎండీఎస్ విత్తనాల వెదజల్లే కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పెద్దఎత్తున ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను అమలు చేసి భూమిని సజీవంగా ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వ్యవసాయ సంచాలకులు గంగాధర్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎఫ్ఎమ్టిలు, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.
