Sircilla పోక్సో, హత్య కేసులలో సంచలన తీర్పు
Sircilla పోక్సో, హత్య కేసులలో సంచలన తీర్పు
- 20 ఏళ్ల జైలు శిక్ష
- హత్య కేసులో జీవిత ఖైదు
సిరిసిల్ల( Sircilla), ఆంధ్రప్రభ: చందుర్తి, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసుతో పాటు అదే బాలిక హత్య కేసులో నిందితుడికి పోక్సో కేసులో 20 ఏళ్లు, హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. కొడిమ్యాల్ మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ అనే వ్యక్తి చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేసిన విషయంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి వేములవాడ డీఎస్పీ వెంకటరమణ దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన అదే మైనర్ బాలిక హత్య కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి వేములవాడ టౌన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో చందుర్తి, వేములవాడ కోర్టు కానిస్టేబుళ్లు లతీఫ్, మహేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ తరఫున మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు.
శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన బండపల్లి నవీన్‌కు పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.7,000 జరిమానాతో పాటు హత్య కేసులో జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధించారు.
ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసి ఎవరూ కూడా శిక్షల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యవస్థాత్మకంగా నేర నిరూపణ, న్యాయ విచారణ జరిపి శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.

