Telangana Public School | కార్పొరేట్ స్థాయి విద్య కోసం ప్రభుత్వ భారీ ప్రణాళిక
Telangana Public School | కార్పొరేట్ స్థాయి విద్య కోసం ప్రభుత్వ భారీ ప్రణాళిక
Telangana Public School | ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
భారీ డిమాండ్‌తో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు
ఆధునిక వసతులతో మోడల్ స్కూల్ నిర్మాణం
పదివేల విద్యార్థులతో సీఎం రేవంత్ సభ
Telangana Public School | ఉమ్మడి రంగారెడ్డి, ఆంధ్రప్రభ బ్యూరో: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రైవేట్ స్కూళ్లలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో, అంతకంటే మెరుగైన వసతులు అందిస్తూ నాణ్యమైన ఇంగ్లిష్ బోధన అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు నాలుగు జిల్లాల నుంచి పదివేల మంది విద్యార్థులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్
పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నిర్మించారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన ఇంగ్లిష్ బోధన అందించనున్నారు. పాఠశాల ఆవరణలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, గ్రీనరీ, ప్రహరీ గోడ, విద్యార్థులకు అందుబాటులో ఉండేలా క్రీడా స్థలాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువులను కూడా సమకూర్చారు.
ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల నుంచి ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,600 సీట్లకు 1,815 దరఖాస్తులు వచ్చాయి. ఇంకా దరఖాస్తులు వస్తుండటంతో పాఠశాల యాజమాన్యం ఇప్పటికే “నో అడ్మిషన్” బోర్డు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పాఠశాల చుట్టూ నిరీక్షిస్తూ పైరవీలు చేస్తున్నారు.
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపకల్పన జరిగింది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి క్రీడలకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపట్నం, గడ్డమల్లయ్యగూడ, బండాలేమూర్, దాద్‌పల్లి, ముకునూరు గ్రామాల మీదుగా ప్రయాణించి విద్యార్థులను తరలించేందుకు ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 61 మంది ఉపాధ్యాయులు, 35 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావడంతో పదివేల మంది విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మండలాల వారీగా విద్యార్థులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో 40 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను తరలించనున్నారు.
