Chityala బ్రిడ్జి నిర్మాణం కోసం రైతుల భారీ పోరాటం
Chityala బ్రిడ్జి నిర్మాణం కోసం రైతుల భారీ పోరాటం
చిట్యాల (Chityala), ఆంధ్రప్రభ: నేరడ–గాదిరెడ్డిపల్లె గ్రామాల మధ్య అనుసంధాన బ్రిడ్జి నిర్మాణం కోసం రైతులు, గ్రామస్తులు భారీ పోరాటం చేపట్టారు. 100 మందికి పైగా రైతులు కాసోజు శంకరాచారి నేతృత్వంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌కు భారీ ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు.
వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని, రైతులు, విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లడం, పంటలను మార్కెట్‌కు తరలించడం కూడా కష్టతరమవుతోందని తెలిపారు.
“ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలి” అని రైతులు కోరారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో పెద్ద మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
రైతుల సమస్యను విన్న జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు రైతులు తెలిపారు.
కలెక్టర్ స్పందనపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని రైతులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
