కలుపు మొక్కల వల్ల రైతులకు కలిగే 4 ప్రధాన నష్టాలు…

  • పత్తి రైతుల లాభాలను మింగేస్తున్న కలుపు మొక్కలు!

భారత్‌లో పత్తి సాగు చేసే రైతులకు కలుపు మొక్కలు కొత్త సమస్య కాదు. కానీ అవి పంటకు ఎంత నష్టం చేస్తున్నాయో చాలామంది పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణంగా కలుపు మొక్కలంటే దిగుబడి కొంత తగ్గుతుందని మాత్రమే భావిస్తారు. అయితే వాస్తవానికి వాటి ప్రభావం అంతకంటే చాలా ఎక్కువ. రైతులు ఖర్చు పెట్టి వేసిన ఎరువులు, నీరు, పోషకాలను కలుపు మొక్కలే దోచుకుంటాయి. ఫలితంగా పంట ఎదుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. అంతేకాదు.. కలుపు మొక్కలు పురుగులు, తెగుళ్లకు ఆశ్రయంగా మారి పంటను మరింత దెబ్బతీస్తాయి. దీంతో రైతుల పెట్టుబడి ఖర్చులు పెరిగి, చివరకు లాభాలు కరిగిపోతాయి.

వ్యవసాయ ఉత్పాదకత తగ్గడానికి కారణమయ్యే అంశాల్లో కలుపు యాజమాన్య లోపాలు కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోతే పంటపై దీని ప్రభావం మొత్తం సీజన్‌ అంతా కనిపిస్తుంది.

‘గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్’ నిర్వహించిన “కాటన్ వాయిస్ ఆఫ్ ఇండియా – ఎ ఫార్మర్ స్టడీ” నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం 47 శాతం మంది రైతులు కలుపు నివారణను తమకు అత్యంత క్లిష్టమైన సవాలుగా పేర్కొనగా, 33 శాతం మంది రైతులు గత కొన్నేళ్లతో పోలిస్తే కలుపు సమస్య మరింత తీవ్రంగా మారిందని అభిప్రాయపడ్డారు.

గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ క్రాప్ కేర్ వ్యాపార విభాగం సీఈఓ రాజవేలు ఎన్.కే. మాట్లాడుతూ.. రైతులు సాధారణంగా భావించేదానికంటే మొత్తం వ్యయ భారం ఎక్కువగా ఉండటానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కనిపించకుండానే దిగుబడిని దెబ్బతీసే కలుపు

పత్తి పంటలో తొలి 60 రోజులు అత్యంత కీలకమైనవిగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కలుపు మొక్కలను నియంత్రించకపోతే రైతు ఊహించిన దానికంటే పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు. కలుపు మొక్కలు పత్తి మొక్కతో పోటీ పడుతూ దాని ఎదుగుదలను అడ్డుకోవడంతో పాటు, కాయల సంఖ్య, పీచు నాణ్యత, మొత్తం దిగుబడిపై ప్రభావం చూపుతాయి. సరైన సమయంలో కలుపు నివారణ చర్యలు తీసుకోకపోతే పత్తి దిగుబడి 40 నుంచి 85 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎరువులు, తేమను హరించే ‘నిశ్శబ్ద శత్రువు’

కలుపు మొక్కలు కేవలం పొలంలో స్థలం ఆక్రమించడం మాత్రమే కాదు.. పంటకు అందాల్సిన పోషకాలను కూడా గుంజేస్తాయి. రైతులు వేసే ఎరువుల్లో 30 నుంచి 50 శాతం వరకు, నేలలోని తేమలో 20 నుంచి 40 శాతం వరకు కలుపు మొక్కలే వినియోగించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పత్తి సాగులో ఇప్పటికే ఎరువుల ఖర్చు అధికంగా ఉండగా, ఈ పోషకాలు ప్రధాన పంటకు కాకుండా కలుపు మొక్కలకు చేరడం రైతుకు అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. ముఖ్యంగా అకాల వర్షాలు, వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్న ప్రస్తుత సమయంలో నేలలోని తేమను కోల్పోవడం పంటకు మరింత నష్టాన్ని కలిగిస్తుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

అందుకే విత్తనాలు నాటిన ప్రారంభ దశ నుంచే కలుపు నియంత్రణపై దృష్టి పెట్టాలని, శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే ఎరువులు, నీరు, పెట్టుబడులు ప్రధాన పంటకే ఉపయోగపడేలా చూడవచ్చని వారు పేర్కొంటున్నారు.

కూలీల ఖర్చు.. రైతుకు పెరుగుతున్న భారం

పత్తి సాగులో కలుపు నియంత్రణ కోసం ఇప్పటికీ చాలామంది రైతులు కూలీలపైనే ఆధారపడుతున్నారు. అయితే పెరుగుతున్న కూలీ రేట్లు, వ్యవసాయ పనులకు కార్మికుల కొరత రైతులకు అదనపు భారంగా మారుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పత్తి సాగులో కలుపు తీయడం, పంట కోత వంటి పనులకే మొత్తం పెట్టుబడిలో గణనీయమైన భాగం వెచ్చించాల్సి వస్తోంది.

కూలీలతో కలుపు తీయించాలంటే ఎక్కువ సమయం, ఎక్కువ ఖర్చు అవసరమవుతుండగా, సీజన్‌లో పలుమార్లు ఈ ప్రక్రియను నిర్వహించాల్సి వస్తోంది. దీంతో రైతులపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యాంత్రిక కలుపు నియంత్రణ, శాస్త్రీయ పరిష్కారాలు రైతులకు కొంత మేర ఖర్చు తగ్గించే అవకాశాలను కల్పిస్తున్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

పురుగులు, తెగుళ్లకు ఆశ్రయంగా మారుతున్న కలుపు

కలుపు మొక్కల వల్ల మరో ప్రధాన సమస్య పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరగడమే. పొలంలో కలుపు ఎక్కువగా పెరిగితే అవి హానికర కీటకాలకు ఆశ్రయంగా మారి పంటపై దాడి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా రైతులు పిచికారీ చేసే పురుగుమందుల ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

దీంతో పంట రక్షణ కోసం అదనపు ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కలుపు నియంత్రణలో నిర్లక్ష్యం ప్రతి వారం రైతుకు అదనపు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పంట ప్రారంభ దశ నుంచే కలుపు నియంత్రణపై దృష్టి పెట్టడం ద్వారా పురుగులు, తెగుళ్ల ముప్పును తగ్గించడంతో పాటు పంటపై పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం పొందవచ్చని సూచిస్తున్నారు.

కలుపు నియంత్రణ.. ఇప్పుడు ఆర్థిక నిర్ణయం కూడా

వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం కలుపు నివారణ అనేది కేవలం పొలాన్ని శుభ్రంగా ఉంచే చర్య మాత్రమే కాదు. అది నేరుగా దిగుబడి, పెట్టుబడి సామర్థ్యం, లాభాలపై ప్రభావం చూపే కీలక అంశంగా మారింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, కూలీల కొరత వంటి సవాళ్ల మధ్య కలుపు మొక్కలను ముందుగానే నియంత్రించే శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

భవిష్యత్తులో పత్తి సాగు లాభసాటిగా కొనసాగాలంటే మంచి విత్తనాలు, అధిక ఎరువులు మాత్రమే సరిపోవని, విత్తిన తొలి రోజుల నుంచే కలుపు మొక్కల ప్రభావాన్ని సమర్థవంతంగా నియంత్రించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.