Bapatla-Ganja-Mafia : మత్తు..మత్తుగా…Andhra Prabha Crime Story
Bapatla-Ganja-Mafia : మత్తు..మత్తుగా…Andhra Prabha Crime Story
- స్లీపింగ్ జోన్ లో.. ‘ఎస్‌బీ’!
- సివిల్ పంచాయతీల్లో తిష్ట
- గంజాయ్ మాఫియా డ్యాన్స్ డ్యాన్స్
- రైల్వే స్టేషన్లు, ఫ్లైఓవర్లు, ఖాళీ స్థలాలే అడ్డాలు |
- రూ.100, రూ.200 ప్యాకెట్లతో విద్యార్థులే లక్ష్యం
- నిమ్మకు నీరెత్తిన పోలీసులు..
- పట్టించుకోని ప్రత్యేక విభాగం
(ఆంధ్రప్రభ బ్యూరో, బాపట్ల)
బాపట్ల జిల్లాలో మత్తు మాఫియా పగలు, రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా పడగవిప్పుతోంది. రక్షక భటుల కళ్లెదుటే అక్రమ రవాణా, విక్రయాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నా స్పెషల్ బ్రాంచ్ నిఘా వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి సంస్కృతి.. ఇప్పుడు బాపట్ల జిల్లాలోని ప్రతి గ్రామానికి వినాశకరంగా విస్తరిస్తోంది. చీరాల, బాపట్ల, రేపల్లె, పట్టణాలతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సరఫరాదారులు ముఠాలుగా ఏర్పడి దందాను సాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ల వెనుక వైపు, ఫ్లైఓవర్ల కింద, పాడుబడిన భవనాలు, చివరికి స్మశాన వాటికలు, విద్యాసంస్థల పరిసరాలనే ప్రధాన కేంద్రాలుగా చేసుకుని మత్తు పదార్థాలను విక్రయిస్తుండడం గమనార్హం.
మత్తు మాఫియా ప్రధానంగా రేపటి పౌరులైన విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ విష సంస్కృతిని వ్యాపింపజేస్తోంది. చిన్న చిన్న కవర్లలో రూ.100, 200 రేట్లకు సరిపడా గంజాయిని ప్యాక్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. సరదాగా ప్రారంభించే అలవాటును క్రమంగా వ్యసనంగా మారుస్తున్నారు. చీకటి పడితే చాలు రాత్రి వేళల్లో ఖాళీగా ఉండే పాఠశాల మైదానాలు, కళాశాల ప్రాంగణాలు, నిర్మానుష్య ప్రదేశాలు ఈ పోకిరీ ముఠాలకు నిలయాలుగా మారుతున్నాయి.
గంజాయి విక్రేతలు అత్యంత ముఠా పద్ధతిలో, చాకచక్యంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఎవరికి పడితే వారికి సరుకు అమ్మడం లేదు. కేవలం ముందస్తు పరిచయం ఉన్న పాత కస్టమర్లకు, వారి ద్వారా వచ్చే నమ్మకస్థులకు మాత్రమే ఈ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కొత్త ముఖాలు కనిపిస్తే.. ‘మాకేమీ తెలియదు’ అంటూ అమాయకత్వం నటిస్తూ జారుకుంటున్నారు. ప్రత్యేకమైన కోడ్ భాషలు, సైగలతోనే కొనుగోలు, విక్రయాల ప్రక్రియ ముగించేస్తున్నారు.
ముఖ్యంగా చీరాల ఫ్లైఓవర్ పరిసరాలు, జాన్‌పేట, జయంతిపేట, మరియమ్మపేట ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఇక బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో తీరప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంట ఉండే నిర్మానుష్య ప్రదేశాలు, సాయంత్రం వేళల్లో జనసంచారం లేని విద్యాసంస్థల పరిసరాల్లో ఈ మత్తు రాయుళ్లు హల్‌చల్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం కావడం ఈ నెట్‌వర్క్ ఎంత లోతుగా మూలాలు పాతుకుందో చాటిచెబుతోంది. స్థానిక పోలీసులు ఎప్పుడో ఒకసారి నామమాత్రపు తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. ఇక అసలు సమాచారాన్ని ముందస్తుగా సేకరించి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ‘స్పెషల్ బ్రాంచ్’ నిఘా విభాగం ఘోరంగా విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు నిఘా విభాగానికి తెలియడంలేదా? లేక తెలిసి చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి
Bapatla-Ganja-Mafia : నిద్ర మత్తులో నిఘా విభాగం..
పోలీస్ కి ప్రధానంగా నిగ విభాగం కళ్ళు చెవులు లాంటివి. ఏదైనా క్రైమ్ జరకమందే ఆ సమాచారం ద్వారా జిల్లా బాస్ కు చేరాలి. కానీ జిల్లాలో అలాంటి పనితీరు కనిపించడం లేదని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.
చీరాల టూ టౌన్ పరిధిలోని ఎస్బి కానిస్టేబుల్ విధులు పక్కన పెట్టి ప్రవేట్ దందాలు, పోలీస్ సెటిల్మెంట్లు మునిగిపోయారని గుసగుసలు వినపడుతున్నాయి. చీరాల వన్ టౌన్ లో ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ సాయంత్రానికి చేరుకొని కేసులు మొత్తం సెటిల్మెంట్లకు దిగుతున్నట్లు చీరాల లో టౌన్ లో గట్టిగా వినపడుతుంది. మరి కొంతమంది అసాంఘిక కార్యకాలపాలైన ఇసుక, పేకాట క్లబులలో వేలు పెట్టి సివిల్ పోలీసులకి సపోర్ట్ చేస్తున్నారని సమాచారం. చీరాల రూరల్ మండలంలో మరో ఎస్బి కానిస్టేబుల్ లాడ్జిలు రిసార్ట్స్ లలో రూములు పేరుతో వేధిస్తున్నాడని ఆరోపణలు వినపడుతున్నాయి.
జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తున్న గంజాయి సంస్కృతితో తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేవలం చిన్న చిన్న ఏజెంట్లను లేదా సేవిస్తున్న వారిని పట్టుకుని చేతులు దులుపుకోవడం కాకుండా.. విశాఖ, అరకు తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయిని సరఫరా చేస్తున్న ప్రధాన తిమింగలాలను గుర్తించి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో గంజాయి అమ్మకాలు సాగుతుండడంపై తీవ్ర దృష్టి సారించి, ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నిద్రమత్తు వదిలి, ప్రత్యేక కార్యాచరణతో విరుచుకుపడితేనే ఈ మత్తు రక్కసిని అరికట్టడం సాధ్యమవుతుంది.
