8 : 00 P.M. | 15.6.2026 ముఖ్యాంశాలు

8 : 00 P.M. | 15.6.2026 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం దాదాపు 41,673 పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన జిల్లాల్లో బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కిట్లు, జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత బ్యాగులు, షూస్ అందిస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం బస్సులు, వ్యాన్లపై కఠిన ఫిట్‌నెస్ తనిఖీలు నిర్వహిస్తూ 138 వాహనాలను నిలిపివేయగా, సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగ సంస్కరణలు, ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

—————————————————

వేసవి సెలవుల అనంతరం అమావాస్య రోజున స్కూళ్లు పునఃప్రారంభం కావడంతో తెలంగాణలో హాజరు శాతం భారీగా తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్ బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కరే హాజరై ఒంటరిగా క్లాస్‌లో కూర్చున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగా కొందరు తల్లిదండ్రులు ఈ రోజును అశుభంగా భావించి పిల్లలను ఇంట్లోనే ఉంచడంతో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ప్రారంభ తేదీలను మార్చుకున్నాయి.

—————————————————

జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు దాడి చేసి ముఖానికి గాయాలు చేయగా, ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగ నిరసనల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఆయనకు బెదిరింపులు, సోషల్ మీడియా హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం.

—————————————————

అమెరికా–ఇరాన్ మధ్య నాలుగు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం, సైనిక చర్యల విరమణ, ఆంక్షల సడలింపు వంటి 14 కీలక అంశాలపై అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే యురేనియం నిల్వలు, అణు వివాదంపై ఇంకా స్పష్టత రాలేదు.

—————————————————

స్విట్జర్లాండ్‌లో ఈ నెల 19న అధికారిక సంతకాలు జరగనుండగా, ఈ ఒప్పందం వల్ల ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు దాదాపు 4 శాతం పతనమై 112 డాలర్ల నుంచి 84 డాలర్లకు పడిపోయాయి. రాజస్థాన్‌లోని చురు జిల్లాను భారీ ఇసుక తుఫాన్ ముంచెత్తింది. గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో దట్టమైన దుమ్ము, ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేయడంతో పట్టపగలే అంధకారం నెలకొని రహదారులపై జీరో విజిబిలిటీ పరిస్థితి ఏర్పడింది. వాహన రాకపోకలు స్తంభించగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు, బికనీర్ తర్వాత ఇప్పుడు చురు ఘటనతో రాజస్థాన్‌లో ప్రజల్లో ఆందోళన పెరిగింది.

—————————————————

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలకు అమరావతి, హైదరాబాద్ వాతావరణ శాఖలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. ఏపీలో మన్యం, అల్లూరి, తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం సహా అనేక జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రాబోయే వారం రోజులు పాటు రుతుపవనాల ప్రభావంతో వానలు జోరందుకుని, కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

—————————————————

కర్ణాటకలోని మైసూరు రెస్టోపబ్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా, పబ్ యజమానితో సహా పలువురు గాయపడ్డారు. మృతులు పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన సాహిన్ (26), నేపాల్‌కు చెందిన ప్రకాశ్ (24)గా గుర్తించగా, గాయపడిన వారిలో సోను, రమేష్, మహదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్ ఉన్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, షార్ట్‌సర్క్యూట్ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

CLICK HERE TO READ MORE l