High alert | అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా..
High alert | అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా..
- వర్షం వస్తే అధికారులు రోడ్డుపైనే ఉండాలి
- అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం క్లాస్
- అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వర్షాకాల పరిస్థితులపై అధికారులు అత్యంత అప్రమత్తంగా (High alert) ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
జూన్ 9న హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో కురిసిన వర్షాల సమయంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ మున్సిపల్, ట్రాఫిక్, పోలీసు యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయలేదని మండిపడ్డారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష నిర్వహించి ప్రత్యేక సూచనలు చేసినప్పటికీ అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదన్నారు.

వర్షం వస్తే అధికారులు రోడ్లపైనే ఉండాలి..
వర్షాల సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ రోడ్లపైకి రావాలని ఆదేశించారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని వ్యాఖ్యానించారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై సహించను. మానవ తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని సీఎం హెచ్చరించారు.
విద్యుత్ అంతరాయాలపై ఆగ్రహం
వర్షాల కారణంగా చెట్లు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం ఉండకూడదని, అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ సిబ్బంది వర్షాల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో రాష్ట్రంలోని జలాశయాలు, ప్రాజెక్టుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్ ప్రకారం జరగాలని, సంబంధిత ఇంజినీర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా విధులు వదిలి వెళ్లే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులకు యూరియా, విత్తనాలపై ప్రత్యేక దృష్టి
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో యూరియా, విత్తనాల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖకు సీఎం సూచించారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేపట్టాలని, సన్న వడ్ల విత్తనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జలమండలి అధికారులకు సీఎం సూచించారు. నీటి నాణ్యత పరీక్షలు తరచుగా నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
మున్సిపల్, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు సూచించిన సీఎం, పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలతో నిరంతర సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.
