Telangana vegetable farming | ఆర్గానిక్ పంటలపై రైతుల ఆసక్తి

Telangana vegetable farming | ఆర్గానిక్ పంటలపై రైతుల ఆసక్తి

Telangana vegetable farming | కూరగాయల సాగుతో రైతులకు ఆదాయం, ఆశాజనక మార్గం
16,800 ఎకరాల్లో సాగు: ఉమ్మడి పాలమూరులో విస్తరణ
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు
బిందు సేద్యం, మల్చింగ్‌తో ఆధునిక వ్యవసాయం

Telangana vegetable farming | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ ప్రతినిధి: వరి, పత్తి సాగు చేసే రైతులు పంట చేతికందేవరకు మదుపులు పెట్టాల్సి ఉంటుంది. వారాంతపు ఆదాయ మార్గాలను ఎంచుకునే క్రమంలో కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులు కూడా అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తే కుటుంబ పోషణకు ఆదాయం లభిస్తుంది. వరి, పత్తి, ఆయిల్‌పామ్, జీడి సాగు చేసే రైతులు తక్కువ సమయంలో ఆదాయం పొందడం కోసం కాయగూరలను సాగు చేస్తున్నారు. అలాగే కూరగాయల రైతులకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సగటున ప్రతి రైతు కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,800 ఎకరాలలో కూరగాయలు సాగు చేస్తున్నారు. నీటి సరఫరా సదుపాయం గల రైతులతోపాటు బోరు బావులపై ఆధారపడిన వారూ సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మూడు పద్ధతుల్లో కాయగూరలు పండిస్తున్నారు. పందిరి సాగులో బీర, సొర, కాకర, దొండ, చిక్కుడు చేస్తున్నారు. మల్చింగ్ ప్రక్రియతో రైతులు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారుల సలహాలతో తేమ నివారణ, కలుపు నివారణ పద్ధతిలోనూ సాగు చేస్తున్నారు. బోరు బావులపై ఆధారపడిన రైతన్నలు బిందు సేద్యాన్ని ఆశ్రయించారు. జూరాల, కోయిల్ సాగర్, సరళాసాగర్ ప్రాజెక్టుల ద్వారా నీటి పారుదల సౌకర్యం కలిగి ఉండడంతో కూరగాయల సాగుకు కలిసొస్తుంది. ఈ కూరగాయలను రైతుబజార్లతోపాటు వారపు సంతల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా టమాటో, వంకాయ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, బీరకాయ, క్యాప్సికం, చిక్కుడు, కాకరకాయ, దొండ, సొరకాయ సాగు చేస్తున్నారు.

రాయితీలు.. ప్రోత్సాహకాలు: వేణుగోపాల్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
కూరగాయల రైతులకు ప్రభుత్వం రాయితీలతో ప్రోత్సహిస్తున్నదని మహబూబ్ నగర్ ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఎకరాకు రూ.9,600 చొప్పున 40 శాతం సబ్సిడీ రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఎకరాకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పోషక నిర్వహణకు రూ.24 వేలు ఖర్చు అవుతుంది. ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాల వరకే సబ్సిడీ వర్తిస్తుంది. సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యానశాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యానశాఖ గుర్తింపు పొందిన నర్సరీల నుంచి నారు, విత్తనాలు కొనుగోలు చేస్తేనే సబ్సిడీ వర్తిస్తుంది. విత్తనాలు, నారు సరఫరా హైదరాబాద్ జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ కేంద్రాల్లో నారు పెంచుతున్నారు. ఎంపికైన రైతులకు విత్తనాలను కూడా సబ్సిడీ ధరకు అందిస్తారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 2700 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. రైతులకు రాయితీలతో పాటు సాగు చేసే పద్ధతులను కూడా నేర్పిస్తున్నాం.

ఆర్గానిక్ పంటలు మేలు
ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అచ్చంపేట సమీపంలోని గుంపనపల్లి గ్రామ రైతు వలిశెట్టి మోహన్ అన్నారు. ఇతనికి సొంతంగా ఎకరన్నర భూమి ఉండగా, అదనంగా 11 ఎకరాలను కౌలుకు తీసుకుని ఆకుకూరలతో పాటు క్యాబేజీ, కాలీఫ్లవర్, మునగ వేశారు. ఆకుకూరల వినియోగం పెరగడంతో వాటి సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోహన్ తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాల కోసం ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలపై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. అలాగే తాను ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తున్నా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఒక ఎకరానికి మాత్రమే మంజూరైందని ఆవేదన వ్యక్తం చేశారు.