Khammam Rape Case | నిమ్స్‌లో బాలికను పరామర్శించిన కవిత
Khammam Rape Case | నిమ్స్‌లో బాలికను పరామర్శించిన కవిత
Khammam Rape Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను శనివారం కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మైనర్లపై జరుగుతున్న నేరాల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
మైనర్లపై రోజూ దారుణ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఖమ్మం ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బాధిత బాలికకు నెలకు రూ.50 వేల పింఛన్ మంజూరు చేయడంతో పాటు, ఆమె తల్లిదండ్రులకు ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని కవిత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
