శ్రీశైలం అమ్మవారికి కోటి రూపాయల విలువైన బంగారు, వెండి కానుకలు

శ్రీశైలం అమ్మవారికి కోటి రూపాయల విలువైన బంగారు, వెండి కానుకలు

భ్రమరాంబిక అమ్మవారికి ఆభరణాలు, పూజా సామగ్రి సమర్పించిన దాతలు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లకు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పూజా సామగ్రిని భక్తులు విరాళంగా సమర్పించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు స్వామి, అమ్మవార్లకు పలు వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను సమర్పించారు.

వీటిలో బంగారు నామాలు, చంద్రవంకతో కూడిన వెండి జటాజూటం, వివిధ వెండి పూజా సామగ్రి, బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలు ఉన్నాయి. సమర్పించిన వెండి వస్తువుల మొత్తం బరువు 42 కిలోల 516 గ్రాములు కాగా, బంగారు ఆభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీగ్రాములుగా ఉంది.

ఈ బంగారు, వెండి వస్తువుల విలువ సుమారు రూ.1 కోటి వరకు ఉంటుందని దాతలు తెలిపారు.

దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మట్టే శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రోహన్, రాకేష్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ డైరెక్టర్ ఆదిత్యకృష్ణ తదితరులు ఈ కానుకలను కార్యనిర్వహణాధికారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్వామివారి ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయకుమార్ స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ధర్మప్రచార పర్యవేక్షకులు నాగేశ్వరరావు, ఆలయ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, ముఖ్య భద్రతాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం దాతలకు రశీదు అందజేసి, వేదాశీర్వచనంతో స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *