AirForce Academy Graduation | ఆధునిక యుద్ధాల్లో సాంకేతికతే కీలకం
AirForce Academy Graduation | ఆధునిక యుద్ధాల్లో సాంకేతికతే కీలకం
AirForce Academy Graduation | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరైన ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు.
గగనతల రక్షణ వ్యవస్థలో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆధునిక యుద్ధాల్లో సాంకేతికత వినియోగం విపరీతంగా పెరిగిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్‌లో ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

అంతకుముందు ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్‌ను రక్షణ మంత్రి ప్రదానం చేశారు. మెరిట్‌లో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు ప్రెసిడెంట్స్ ప్లాక్ అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో సుఖోయ్ యుద్ధ విమానాలు, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం, సారంగ్ హెలికాప్టర్ బృందం విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తొలి ఎన్‌డీఏ మహిళా క్యాడెట్ల కమిషనింగ్‌కు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వేదిక కావడం విశేషంగా నిలిచింది.
ఎయిర్‌చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్ నేతృత్వంలో ఫ్లైపాస్ట్ నిర్వహించగా, వియత్నాం ట్రైనీలకు కూడా శిక్షణ పూర్తి ధ్రువపత్రాలు అందజేశారు. పరేడ్ ప్రారంభానికి ముందు ఆకాష్‌గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
