Ashirwad Suryavanshi | అన్న బాటలో తమ్ముడు..
Ashirwad Suryavanshi | అన్న బాటలో తమ్ముడు..
Ashirwad Suryavanshi | సూర్యవంశీ కుటుంబంలో మరో స్టార్..
10 ఏళ్ల ఆశీర్వాద్ సెంచరీ
శతకంతో మెరిసిన ఆశీర్వాద్ సూర్యవంశీ
వైభవ్ తర్వాత ఆశీర్వాద్ హవా.. చిన్న వయసులోనే సెంచరీ
87 బంతుల్లో 103 పరుగులు..
ఆశీర్వాద్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వెల్లువ
Ashirwad Suryavanshi | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో ప్రతిభావంతుడు వెలుగులోకి వచ్చాడు. వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కేవలం 10 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించి క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. బిహార్‌లో జరిగిన ఓ స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో తాజ్పూర్ క్రికెట్ అకాడమీ తరఫున బరిలోకి దిగిన ఆశీర్వాద్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 87 బంతుల్లో ఒక సిక్సర్, 20 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. 118.39 స్ట్రైక్‌రేట్‌తో ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించడం విశేషం.
ఈ ఘనతను వైభవ్ సూర్యవంశీ సోదరుడు ఉజ్వల్ సూర్యవంశీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడంతో ఆశీర్వాద్ పేరు వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే శతకం నమోదు చేయడంతో క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

తమ్ముడి ప్రదర్శనపై వైభవ్ సూర్యవంశీ కూడా స్పందించాడు. ఆశీర్వాద్ స్కోర్‌కార్డును తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ‘కంగ్రాట్స్ ఆశీర్వాద్’ అంటూ అభినందనలు తెలిపాడు. ఈ పోస్టుకు తన చిన్ననాటి ఫొటోను జత చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వైభవ్ సూర్యవంశీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఉజ్వల్ సూర్యవంశీ పెద్దవాడు కాగా, ఆశీర్వాద్ చిన్నవాడు. ఉజ్వల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఆశీర్వాద్ మాత్రం తన అన్న బాటలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ఇక ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్-ఏ జట్టు తరఫున అఫ్గానిస్థాన్-ఏ, శ్రీలంక-ఏ జట్లతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుతున్నాడు.

