గుండెపోటుతో ఎస్బీ ఎస్సై మృతి..

గుండెపోటుతో ఎస్బీ ఎస్సై మృతి..

  • 2 నెలలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స..
  • 14 నెలలైతే పదవి విరమణ..

జన్నారం, ఆంధ్రప్రభ : పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన ఎస్బీ ఎస్సై గుండెపోటుతో మృతి చెందిన విషాదకర సంఘటన ఇది.అతను 14 నెలలైతే ఉద్యోగ పదవి విరమణ పొందనున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మురిమడుగు వాసి,59 ఏండ్ల 10 నెలల జాడి గంగన్న శుక్రవారం గుండెపోటుతో ఆసుపత్రిలో మృతి చెందారు.అతను 1966 ఆగస్టు 12న మురిమడుగులో జన్మించి,1989లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి,2012లో హెడ్ కానిస్టేబుల్ గా,2018లో ఏఎస్ఐగా,2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్ఐగా పనిచేస్తున్నారు.

అతను పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఎస్సై స్థాయికి చేరుకున్నారు.అతను గత 2 నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలనే వచ్చారు.ఆ తర్వాత అతను శుక్రవారం అనారోగ్యానికి గురై కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, గుండెపోటు గురై ఉదయం చనిపోయారు. మృతునికి భార్య అన్నపూర్ణతో పాటు వివాహితులైన ముగ్గురు కుమారులు ఉన్నారు. అతను పోలీస్ శాఖలోనూ,ప్రజలతోనూ ఎంతో కలివిడిగా ఉంటూ అందరితో నవ్వుతూ పలకరిస్తూ, నోట్లో నాలుకలాగా ఉండేవారని సహచర పోలీసులు తెలిపారు.

మృతుని సొంతూరైన మురిమడుగులో రాత్రి అంత్యక్రియలు చేయనున్నారు.మృతదేహం వద్ద భార్య,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.గంగన్న పార్థివ దేహానికి మురిమడుగులో పోలీస్ ఆఫీసర్ల సంఘం రామగుండం కమిషనరేట్ అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మృతుని కుటుంబాన్ని అన్ని విధాల పోలీస్ శాఖ ఆదుకుంటుందన్నారు.ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్లను తాను దగ్గరుండి ఇప్పించడానికి ప్రయత్నిస్తానని,అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.