నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు..!

నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు..!

లక్షల వ్యయంతో నిర్మించిన భవనాలు వినియోగంలోకి రాక ప్రజల ఆవేదన

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు వినియోగంలోకి రాక నిరుపయోగంగా మారాయి.

ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టూర్, మోపిడి, రాయంపల్లి, లత్తవరం గ్రామాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో భవనాలు దిష్టిబొమ్మలుగా నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న ముష్టూర్‌లో ప్రస్తుతం రైతు సేవా కేంద్రాన్ని పాత, శిథిలావస్థకు చేరిన భవనంలో కొనసాగిస్తుండగా, అది కూలడానికి సిద్ధంగా ఉందని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అలాగే ఆమిద్యాల, లత్తవరం, ఉరవకొండ గ్రామాల్లో గ్రామ సచివాలయ భవనాలు పూర్తయినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదని ప్రజలు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ కేంద్రాలు కూడా ప్రారంభం కాకపోవడంతో సిబ్బంది సేవల నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాలకు దూరంగా నిర్మించిన కొన్ని భవనాలను ఆసరాగా తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply