దేశవ్యాప్తంగా తగ్గని బాల్య వివాహాల సమస్య

దేశవ్యాప్తంగా తగ్గని బాల్య వివాహాల సమస్య

NFHS-6 సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు
తూర్పు రాష్ట్రాల్లో అత్యధిక బాల్య వివాహాలు
దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లో అధిక రేటు
విద్య, అవగాహనతోనే పరిష్కారం సాధ్యం

న్యూఢిల్లీ: బాలికా విద్య పెరుగుతున్నా, ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఎంత మేలుకొలుపుతున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరులో బాల్య వివాహాలు మాత్రం తగ్గడం లేదు. వికసిత్ భారత్ కోసం ఎన్ని దార్శనికతలను ప్రకటిస్తున్నా పేదరికం, అవిద్య, అజ్ఞానాలకు బాలికలు బలవుతున్నారు. చిన్నారి పెళ్లికూతుళ్ల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికీ దేశంలో ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరికి బాల్యంలోనే వివాహం జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -6 (ఎన్ఎఫ్ఎచ్ 6) వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో భారతదేశం బాల్య వివాహాలను తగ్గించడంలో పురోగతిని సాధించినప్పటికీ, దేశ వ్యాప్తంగా లక్షలాది మంది బాలికలపై ఈ ఆచారం ప్రభావం చూపుతూనే ఉందని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2023 – 24) వెల్లడించింది.

20-24 ఏళ్ల వయసు గల మహిళల్లో 20.1 శాతం మందికి చట్టబద్ధమైన వయస్సు అయిన 18 ఏళ్లు నిండక ముందే వివాహం జరిగినట్లు ఈ సర్వే పేర్కొంది. ఇది బాల్య వివాహాల నిర్మూలనలో ఉన్న సవాళ్లను తెలియజేస్తోంది.

బాలికలకు పెరిగిన విద్యావకాశాలు, అవగాహన కార్యక్రమాలు, బాల్య వివాహాల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయడం వల్ల చాలా వరకు బాల్య వివాహాలు తగ్గినప్పటికీ, వివిధ రాష్ట్రాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాల రేటు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది.

ప్రధాన రాష్ట్రాలలో బీహార్‌లో బాల్య వివాహాల ప్రాబల్యం అత్యధికంగా నమోదైంది. అక్కడ 20-24 ఏళ్ల వయస్సు గల మహిళల్లో 34.6 శాతం మందికి 18 ఏళ్లు నిండక ముందే వివాహం జరిగినట్లు తేలింది. అంటే ప్రతి ముగ్గురు యువతుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది బాల్య దశలోనే వివాహం చేసుకున్నారు. ఇది ఒక తీవ్ర ఆందోళనకర పరిస్థితిగా పేర్కొనబడుతోంది.

బీహార్ తరువాత జార్ఖండ్ (28.1 శాతం), అస్సాం (25.3 శాతం) ఉన్నాయి. తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో బాల్య వివాహాల ఆచారం ఇంకా బలంగా పాతుకుపోయి ఉన్నట్లు ఈ డేటా తెలియజేస్తోంది.

అనేక దక్షిణ, ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్ (20.0 శాతం), మహారాష్ట్ర (19.7 శాతం), ఒడిశా (18.6 శాతం), గుజరాత్ (18.0 శాతం)లో అధికంగా ఉన్నాయి.

దక్షిణాదిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బాల్య వివాహాలు నమోదయ్యాయి. 2.9 శాతంతో కేరళ ఆదర్శ రాష్ట్రంగా నిలువగా, పుదుచ్చేరి (5.6 శాతం) తరువాత తెలంగాణ (6.8 శాతం) మూడవ స్థానంలో ఉంది.

కేరళ, తెలంగాణ, మిజోరాం (6.0 శాతం), హిమాచల్ ప్రదేశ్ (7.9 శాతం) దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి. దక్షిణాదిలో కేరళ తరువాత తెలంగాణ భారతదేశంలో అత్యల్ప రేటు కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్లో బాల్య వివాహాల శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నప్పటికీ, తెలంగాణలో నమోదైన స్థాయి కంటే రెట్టింపునకు పైగా ఉండటం గమనార్హం.

మహిళల ఆరోగ్యం, విద్యా సాధన, ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాల కృషి, బేటీ బచావో బేటీ పఢావో వంటి కార్యక్రమాలు, మెరుగైన స్కాలర్షిప్ పథకాలు, కౌమార ఆరోగ్య కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు దేశంలోని అనేక ప్రాంతాలలో బాల్య వివాహాల పట్ల ప్రజల వైఖరిని మార్చడానికి దోహదపడ్డాయి.

అయినప్పటికీ మరింత పురోగతి సాధించడానికి బహుముఖ వ్యూహం అవసరమని నిపుణులు వాదిస్తున్నారు. మాధ్యమిక విద్యను బలోపేతం చేయడం, కౌమార బాలికలకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడం, సంతాన ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తేవడం, బాల్య వివాహ చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా బాల్య వివాహాలను మరింత తగ్గించవచ్చంటున్నారు.

దీర్ఘకాలంగా పాతుకుపోయిన సామాజిక కట్టుబాట్లను మార్చడానికి సమాజ భాగస్వామ్యం, ముఖ్యంగా తల్లిదండ్రులు, స్థానిక నాయకులు, విద్యా సంస్థల భాగస్వామ్యం కూడా అవసరమని చెబుతున్నారు.

Leave a Reply