భీమా పథకం ప్రతి కార్మికుడికి ధీమా..

భీమా పథకం ప్రతి కార్మికుడికి ధీమా..

నంద్యాలలో ఈఎస్ఐసీ నూతన కార్యాలయం ప్రారంభం

నంద్యాల బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : కార్మికుల సామాజిక భద్రతకు కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐసీ) పథకం ఎంతో ఉపయోగకరమని, బీమా పొందిన ప్రతి వ్యక్తి ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాలని కార్మిక రాజ్య బీమా సంస్థ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రాధాకృష్ణ పేర్కొన్నారు.

బుధవారం నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ ప్రాంతంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ కరీం, కర్నూలు బ్రాంచ్ మేనేజర్ దుర్గాప్రసాద్, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా పథకం పరిధిలోని కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన సేవలు అందించడంలో ఈ నూతన కార్యాలయం కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. పథకం ద్వారా అందించే వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ముఖ్యంగా డిపెండెంట్ బెనిఫిట్ పథకం గురించి వివరించి, అర్హులైన బీమా పొందిన వ్యక్తులకు డిపెండెంట్ బెనిఫిట్ సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే బీమా పొందిన వ్యక్తుల పిల్లలు ఈఎస్ఐసీ కోటా ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో నామమాత్రపు ఫీజుతో ప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

నంద్యాల జిల్లా శాఖ కార్యాలయం ద్వారా జిల్లాలోని 1,035 మంది యజమానులు, 17,958 మంది బీమా పొందిన వ్యక్తులకు వైద్య, నగదు మరియు ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

తిరుపతిలోని ఉప ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది జాయింట్ డైరెక్టర్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సందీప్ సంస్థ ప్రగతి వివరాలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పరిశ్రమల యజమానుల ప్రతినిధులు, సుజల పైప్స్, మహా సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ సంస్థల ప్రతినిధులు, బీమా పొందిన కార్మికులు, ఇన్సూరెన్స్ మెడికల్ అధికారులు, ఈఎస్ఐసీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply