విలీన గ్రామాలకు నగర స్థాయి సౌకర్యాలు

విలీన గ్రామాలకు నగర స్థాయి సౌకర్యాలు

అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం: ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు నగరంలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని, నగరానికి ధీటుగా విలీన ప్రాంతాలను కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.

స్థానిక 5వ డివిజన్ వినాయక్‌నగర్ వాటర్ ట్యాంక్ రోడ్డు ప్రాంతానికి చెందిన ప్రజలు ఇటీవల ఎమ్మెల్యేను కలిసి తమ ప్రాంతంలోని రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలో ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేశారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఆ ప్రాంతంలో ఒక రహదారి నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. అలాగే డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.1.43 కోట్ల వ్యయంతో నీటి ట్యాంకుల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రకటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ 5వ డివిజన్ ఇన్‌ఛార్జి, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply