Jailer 2 | రజనీ ఫ్యాన్స్‌కు నిరాశ..
Jailer 2 | రజనీ ఫ్యాన్స్‌కు నిరాశ..
- మళ్లీ వాయిదా పడనున్న ‘జైలర్ 2’?
- నెలరోజుల సీక్వెన్స్ రీషూట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Jailer 2 ‘ సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సీక్వెల్లో కీలక సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
సమాచారం ప్రకారం.. ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలపై దర్శకుడు నెల్సన్, అతని బృందం పూర్తిగా సంతృప్తి చెందలేదట. ముఖ్యంగా జైలర్ ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న రియలిస్టిక్ యాక్షన్ టచ్ ఈ సన్నివేశాల్లో కనిపించలేదని భావించి వాటిని తిరిగి చిత్రీకరించాలని మూవీ యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
2023లో విడుదలైన ‘జైలర్’ భారీ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి రజనీకాంత్‌ను హుందాగా, సహజంగా చూపించడం. అదే ఫార్ములాను కొనసాగించేందుకు నెల్సన్ ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
దీపావళి 2026కే విడుదల?
ఈ రీషూట్ ప్రక్రియకు దాదాపు నెలరోజుల సమయం పట్టే అవకాశముందని సినీ వర్గాల సమాచారం. దీంతో ముందుగా వినిపించిన సెప్టెంబర్ 2026 విడుదల తేదీపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా దీపావళి 2026 లక్ష్యంగా ముందుకు వెళ్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీజర్ కూడా ఇంకా విడుదల కాలేదు. టీజర్ ఆలస్యం, షూటింగ్ జాప్యం, ఇప్పుడు రీషూట్ వార్తలతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు.
అయితే ఈ ఆలస్యాలన్నీ సినిమా నాణ్యత కోసం చేస్తున్న ప్రయత్నాలేనని రజనీ అభిమానులు భావిస్తున్నారు. మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రజనీకాంత్.. సీక్వెల్లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. సినిమా ఆలస్యమైనా పర్వాలేదు కానీ, ‘జైలర్’ స్థాయికి మించి ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు నెల్సన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.
