ఉప్పరపల్లి ధాన్య లారీల మిస్టరీ!

ఉప్పరపల్లి ధాన్య లారీల మిస్టరీ!

  • ఉప్పరపల్లి రైతులకు ధాన్యం కష్టాలు
  • లారీల జాడ తెలియక ఆందోళన.. రోడ్డుపైనే నిలిచిన ధాన్యం
  • వారం రోజులుగా సంచుల్లోనే పడి ఉన్న వరి
  • అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

అచ్చంపేట, ఆంధ్రప్రభ:

ఉప్పునుంతల మండలం, ఉప్పరపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వరి కొనుగోళ్లలో తీవ్ర అవ్యవస్థ నెలకొన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి కొనుగోలు చేసిన మొదటి రెండు లారీల ధాన్యాన్ని కొండారెడ్డిపల్లి విఘ్నేశ్వర మిల్లుకు తరలిస్తామని అధికారులు ట్రక్‌షీట్లు జారీ చేసినప్పటికీ, ఆ లారీల జాడ ఇప్పటికీ తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా, గత వారం తాడూరులోని శ్రీ లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు తరలించిన ధాన్యంపై తరుగు విధించడం రైతులను ఆందోళనకు గురిచేసింది. నాణ్యత పేరుతో రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు. మరోవైపు జూన్‌ 6న గ్రామానికి వచ్చిన లారీ (టీఎస్ 05 యుబి 8966) ధాన్యం ఎక్కించకుండానే రోడ్డుపై నిలిపి డ్రైవర్ వెళ్లిపోవడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేసింది. లారీ కాంట్రాక్టర్‌, డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు చెబుతున్నారు. ఉదయం నుంచి హమాలీలు, రైతులు లారీ వద్దే వేచి ఉన్నప్పటికీ ధాన్యం తరలింపుపై ఎలాంటి స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వారం రోజులుగా సంచుల్లో నింపిన వరి ధాన్యం వర్షాలకు తడిసి పాడయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ఐకేపీ ప్రతినిధులు, సివిల్‌ సప్లై అధికారులు వెంటనే స్పందించి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులంతా కలిసి ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply