ఆంజనేయుడి సన్నిధిలో బైరెడ్డి ప్రతిజ్ఞ

ఆంజనేయుడి సన్నిధిలో బైరెడ్డి ప్రతిజ్ఞ

నందికొట్కూరు , ఆంధ్రప్రభ:

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి శ్రీ వీరాంజనేయస్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకాలు పుష్పార్చనలు హారతులు సమర్పించారు. ఆలయ పూజారులు వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి భక్తులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 10 నిమిషాలు దేవాలయానికి కేటాయించాలి. ఉదయం లేవగానే కరదర్శనం సాయంత్రం దీపారాధన చేసే అలవాటును పిల్లలకు నేర్పాలి అని పిలుపునిచ్చారు.

శ్రీ ఆంజనేయస్వామి వాయుదేవుని వరప్రసాదం. అంజనాదేవి, కేసరి పుత్రుడిగా జన్మించిన స్వామి బాల్యం నుంచే అసమాన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. సూర్యుడినే మింగబోయిన బాలహనుమంతుని చరిత్ర ఆయన అపార శక్తికి నిదర్శనం. శ్రీరామచంద్రుని దాసుడిగా సీతమ్మ తల్లి శోకాన్ని పోగొట్టిన దూతగా లక్ష్మణునికి సంజీవని తెచ్చిన ప్రాణదాతగా లంకను దహించిన వీరుడిగా హనుమంతుని కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది.

అష్టసిద్ధులు నవనిధులు ఆయన సొంతం. అయినా అహంకారం లేని నిరాడంబరత ఆయన గొప్పతనం.బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అనే శ్లోకం ప్రకారం హనుమంతుని స్మరిస్తే బుద్ధి బలం కీర్తి ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం సిద్ధిస్తాయి. కలియుగంలో భక్తుల మొర ఆలకించే ప్రత్యక్ష దైవం ఆంజనేయస్వామి. హనుమాన్ చాలీసా పఠనం వల్ల శని దోషాలు గ్రహపీడలు, దుష్టశక్తుల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. చిన్నపిల్లలకు చాలీసా నేర్పండి. మొబైల్ ఫోన్లు టీవీలకు దూరంగా ఉంచి భగవంతుని వైపు నడిపించండి. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయస్వామి గుడికి కుటుంబంతో రండి. సింధూరం పెట్టుకోండి, తమలపాకుల దండ వేయండి, వడమాల సమర్పించండి. భక్తి ఉంటేనే ముక్తి దొరుకుతుంది అని బైరెడ్డి ఉద్బోధించారు.

యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా భక్తి మార్గంలో నడిస్తే గ్రామంతో పాటు దేశం బాగుపడుతుందని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పుస్తకం ఉండేలా చూస్తానని ప్రతి వారం సామూహిక చాలీసా పారాయణం ఏర్పాటు చేస్తామని బైరెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు మహిళలు యువకులు వందల సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Leave a Reply