Musi River Rejuvenation | మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో జాప్యం

Musi River Rejuvenation | మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో జాప్యం

Musi River Rejuvenation | డీపీఆర్ సిద్ధం కాక అధికారుల అసహనం
ముసాయిదా ప్రజెంటేషన్ తర్వాతా ముందుకు సాగని ప్రక్రియ
పూర్తి డీపీఆర్‌కు మరో ఆరు నెలలు పట్టే అవకాశం

Musi River Rejuvenation | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీకి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ అనుసరిస్తున్న నాన్పుడు ధోరణి వల్ల మరింత జాప్యం అవుతోంది. సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి సంస్థ మెయిన్ హార్ట్ 2024 డిసెంబర్ 4న మూసీ డీపీఆర్ టెండర్‌ను దక్కించుకుంది. మొత్తం 55 కిలోమీటర్ల వ్యాప్తంగా మూసీకి ఇరువైపులా పునరుజ్జీవం కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత 18 నెలల్లో డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ, అగ్రిమెంట్ గడువు ముగిసినప్పటికీ, మూసీ ప్రాజెక్టుకు మొదటి విడత డీపీఆర్ కూడా తయారు చేయకపోవడంపై ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆ సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మూసీ ప్రాజెక్టు శ్రీకారానికి ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ, సంస్థ చేస్తున్న తీవ్ర జాప్యం కారణంగానే ప్రాజెక్టు పట్టాలెక్కడానికి అవరోధంగా నిలుస్తోంది. దీనివల్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) కార్యాలయంలో ఇంజనీర్లు, అధికారులకు చేయడానికి పనేం లేక.. గోళ్లు గిల్లుకుంటున్నారు.

ముసాయిదాపై ప్రజెంటేషన్ ఇచ్చినా…

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి, హైదరాబాద్ నగరం గుండా సుమారు 250 కిలోమీటర్లు ప్రవహించే మూసీ సూర్యాపేట జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గండిపేట నుంచి గౌరెళ్లి వరకు పునరుజ్జీవం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గండిపేట నుంచి బాపూఘాట్, బాపూఘాట్ నుంచి పురానాపూల్, పురానాపూల్ నుంచి ఎంజీబీఎస్, ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి గౌరెళ్లి వరకు మొత్తం 55 కిలోమీటర్లు పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వం భావించింది.

ఈ ప్రాజెక్టును పురోగతి వైపు నడిపించేందుకు తార్నాకలోని ఎంఆర్డీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని మాసబ్‌ట్యాంక్‌కు మార్చడం దగ్గర నుంచి ముసాయిదా డీపీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయాన్ని భారీగా నిర్మించేందుకు భూమి పూజ చేయడం వరకు ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ముసాయిదా డీపీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా డీపీఆర్ ఫైనల్ కాకపోవడంపై అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

మరో ఆరు నెలలు…

ప్రభుత్వం చేపట్టనున్న 55 కిలోమీటర్ల మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు 2024 డిసెంబర్ 4 నుంచి 18 నెలల్లో డీపీఆర్ సిద్ధం కావాల్సి ఉండగా, ముసాయిదా డీపీఆర్ 6 నెలల్లోనే పూర్తిచేయాల్సి ఉంది. కానీ, 18 నెలల గడువు పూర్తయినప్పటికీ, ఇంకా డీపీఆర్ సిద్ధం కాకపోవడమే కాకుండా, మొదటి విడత బాపూఘాట్ వరకైనా డీపీఆర్‌ను సిద్ధం చేయకపోవడం టెండర్ దక్కించుకున్న సంస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోంది.

మొత్తం 55 కిలోమీటర్ల వ్యాప్తంగా ఇంకా సర్వేలు కొనసాగుతుండగా.. మొదటి విడతలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల మార్గాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇరువైపులా 21 కిలోమీటర్ల డీపీఆర్ మరో 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉండగా, మొత్తం 55 కిలోమీటర్ల డీపీఆర్‌కు మరో ఆరు నెలలు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply