నీట్ లీక్పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నూతన కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : బీసీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నగేష్ సూర్యవంశం, ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి గౌతమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బైకిని రమేష్, అధికార ప్రతినిధిగా నాది శివరాజ్, కార్యదర్శిగా శ్రీశైలం నియమితులయ్యారు.
నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జీవో నెంబర్-7ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి నాయకులు కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఇతర విద్యార్థి సంక్షేమ నిధులను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కూడా స్పందించిన నూతన కార్యవర్గం.. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
