చిత్తూరులో “యోగాంధ్ర” ర్యాలీతో యోగా సందేశం
చిత్తూరులో “యోగాంధ్ర” ర్యాలీతో యోగా సందేశం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించిన “యోగాంధ్ర” సన్నాహక ర్యాలీ ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వంటి విలువలు పెంపొందుతాయని జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి రైల్వే వంతెన మీదుగా గాంధీ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ సర్కిల్ వద్ద యోగాంధ్ర ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం ఏర్పాటు చేశారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి రానున్న 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 200 మంది మాస్టర్ ట్రైనీలను గుర్తించి శిక్షణ ఇచ్చామని, వారి ద్వారా గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు యోగా సాధనపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో యోగా ట్రైనర్ల ద్వారా స్థానిక ప్రజలకు శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కాణిపాకం, పులిగుండు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో థీమాటిక్ యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాలని, రోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాల్లో పాల్గొని “ఆరోగ్య చిత్తూరు – యోగా చిత్తూరు”గా జిల్లాను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో సుబ్బరాజు, నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, డీఎంహెచ్‌వో డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయి.
