యోగాంధ్రకు శ్రీకాకుళం సిద్ధం..
యోగాంధ్రకు శ్రీకాకుళం సిద్ధం..
జూన్ 21న 1,500 మందితో మహా యోగా
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న నిర్వహించనున్న కార్యక్రమాలపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత ఏడాది యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహంతో ఈసారి కూడా యోగాంధ్రను విజయవంతం చేయాలని కోరారు.
కార్గిల్ పార్క్లో రోజూ యోగా
జూన్ 7వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్క్లో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో కూడా యోగా శిక్షణలు కొనసాగుతాయని చెప్పారు.
దశలవారీగా యోగా పోటీలు
జూన్ 7 నుంచి 9 వరకు గ్రామ స్థాయి, 10 నుంచి 12 వరకు మండల స్థాయి, 14 నుంచి 16 వరకు జిల్లా స్థాయి, 18 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోలో యోగా, ప్రాణాయామం, సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, క్విజ్, వ్యాసరచన, నినాద రచన వంటి విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు.
మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ
జూన్ 6, 7 తేదీల్లో 200 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తామని, వారు జూన్ 8 నుంచి 12 వరకు 40 మంది చొప్పున యోగా ట్రైనర్లకు శిక్షణ అందిస్తారని తెలిపారు. అనంతరం సచివాలయాల స్థాయిలో పౌరులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
ప్రత్యేక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు
జూన్ 11న మత్స్యకారుల గ్రామాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పర్యాటక ప్రదేశాలైన డచ్ బంగ్లా వద్ద జూన్ 16న, ప్రముఖ పుణ్యక్షేత్రం Sri Kurmam Temple వద్ద జూన్ 19న యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జూన్ 21న భారీ యోగా కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజైన జూన్ 21న ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1,500 మంది పాల్గొనే భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
యోగా వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు యోగాంధ్ర యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా పాల్గొన్నారు.
