రివ్యూలతో కాదు… వనరులతోనే రెవెన్యూ శాఖ బలోపేతం

రివ్యూలతో కాదు… వనరులతోనే రెవెన్యూ శాఖ బలోపేతం

ప్రత్యేక రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని ఏపీఆర్‌ఎస్‌ఏ డిమాండ్
సర్ రీ సర్వే, పాసుపుస్తకాల పంపిణీ సమన్వయంతో నిర్వహించాలన్న సూచన
పెండింగ్ తహశీల్దార్ పదోన్నతుల పరిష్కారానికి మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు కృతజ్ఞతలు
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు

(విజయవాడ, ఆంధ్రప్రభ ) రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలంటే కేవలం సమీక్ష సమావేశాలు నిర్వహించడం సరిపోదని, కార్యాలయాలకు తగిన సిబ్బంది, నిధులు, మౌలిక వసతులు, నిరంతర శిక్షణ కల్పించడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) స్పష్టం చేసింది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శనివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.

ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉద్యోగుల సమస్యలు, పరిపాలనా అంశాలపై విస్తృతంగా చర్చించారు.

..పదోన్నతులకు మార్గం సుగమం చేసిన వారికి ధన్యవాదాలు..

గత నాలుగేళ్లుగా కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన తహశీల్దార్ పదోన్నతుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మిలకు సమావేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దాదాపు 300 మంది అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా రెవెన్యూ ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపారని పేర్కొంది.

..మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు… ఒకేసారి భారం వద్దు…

భారత ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ , రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాలు ఒకేసారి అమలవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులపై తీవ్రమైన పనిభారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాలు ఒకదానితో మరొకటి ఓవర్‌ల్యాప్ కాకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

..కోర్టు కేసులు, కార్యాలయ నిర్వహణకు ప్రత్యేక నిధులు అవసరం…

కోర్టు ధిక్కరణ కేసుల విచారణలకు తరచూ హాజరుకావాల్సి వస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని సమావేశం పేర్కొంది. ప్రభుత్వ విధుల నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఈ ఖర్చులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేసింది. అలాగే తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల నిర్వహణకు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా బడ్జెట్‌ను పెంచాలని కోరింది.

..ప్రత్యేక రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలి..

రెవెన్యూ చట్టాలు, భూ పరిపాలన, రీ సర్వే, డిజిటల్ ల్యాండ్ మేనేజ్‌మెంట్, ఎన్నికల విధులు, న్యాయపరమైన అంశాల్లో ఉద్యోగులకు నిరంతర శిక్షణ అందించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక “రెవెన్యూ అకాడమీ” ఏర్పాటు చేయాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడింది.

..కార్యాలయాల దుస్థితిపై ఆందోళన..

సమావేశంలో అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 234 తహశీల్దార్ కార్యాలయాలకు మరమ్మతులు అవసరమని, 160 కార్యాలయాలకు కొత్త భవనాలు అవసరమని, 35 ఆర్డీఓ కార్యాలయాలు నిర్మించాల్సి ఉండగా, 21 కార్యాలయాలకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. కనీస మౌలిక సదుపాయాలు, పని వాతావరణం లేకుండా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం కష్టమని పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి, భూ పరిపాలన, సంక్షేమ పథకాల అమలులో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నందున ఉద్యోగుల సమస్యలు, మౌలిక అవసరాలు, శిక్షణ, పరిపాలనా మద్దతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశం తీర్మానించింది.

Leave a Reply