మహిళల, బాలబాలికల భద్రత అవగాహన కార్యక్రమం
మహిళల, బాలబాలికల భద్రత అవగాహన కార్యక్రమం
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల ప్రకారం వెస్ట్ డి.సి.పి జి. రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేట కె.బి.ఎన్ కాలేజీ ఆడిటోరియంలో క్రైం ఎగనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్, బి.ఎన్.ఎస్ యాక్ట్, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసిపి జి రామకృష్ణ సమాజంలో మహిళల పై జరుగుతున్న నేరాలు వాటిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు వివరించారు. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ను వాహనం నడిపే ప్రతి వ్యక్తీ కలిగి ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ సిటి మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి భారతీయ న్యాయ సంహిత, వరకట్న నిషేధం చట్టం ఫోక్సో చట్టం పై అవగాహన కల్పించారు. అనవసరం విషయాల్లో తల దూర్చి విద్యార్ధి విద్యార్దినీలు వారి భవిష్యత్తు ని నాశనం చేసుకోవద్దని అన్నారు, మైనర్ గర్ల్ ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా ఆమె సమ్మతి చెల్లదని అన్నారు, మైనర్ గర్ల్స్ తో అసభ్యంగా ప్రవర్తించడం కూడా ఫోక్సో చట్టం క్రింద నేరమని తెలిపారు. సమాజములో స్త్రీలను గౌరవించి వారితో సోదర భావముతో మెలగాలని సూచించారు. విజయవాడ సిటి సైబర్ క్రైమ్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇందులో ఆన్లైన్లో వివిధ యాప్ ల ద్వారా పరిచయం లేని వ్యక్తులు సులువుగా డబ్బులు సంపాదించ వచ్చని లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు.
దాని నుండి తప్పించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. ఇంటర్నెట్ ను అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించ కుండా సక్రమంగా వినియోగించాలని సూచించారు. అశ్లీల చిత్రాలు, అసభ్య పద జాలాలు కలిగిన సమాచారము ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం వంటివి చేయరాదని అన్నారు. దాని పై తీసుకునే చట్టపరమైన చర్యలు వలన భవిష్యత్తు పాడు చేసుకోవద్దని అన్నారు. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ లో వచ్చే తెలియని ఫైల్స్ ను ఓపెన్ చేసి తద్వారా మోసపోకూడని తెలియజేశారు.టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ చిన్న కొండల రావు మహిళ ల పై సమాజంలో జరుగుతున్నా నేరాలు, వాటిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు వివరించారు. యువత మత్తు పదార్ధాలకు అనగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి భవిష్యత్తు నాశనము చేసుకోవద్దని సూచించారు,
ప్రతి ఒక్కరూ మత్తు పదార్ధాలకు దూరముగా ఉంటామని ప్రతిజ్ఞబూనాలని అన్నారు, మన సమాజాన్ని మత్తు పదార్ధ రహిత సమాజం గా మార్చడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని, మత్తుపదార్ధాల విక్రయం, రవాణా గురించి ఏ సమాచారము తెలిసిన యెడల పోలీసు వారికి తెలియపరచి శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసు వారికి సహకరించాలని, అలాగే డ్రగ్స్ రహిత సమాజం గా మార్చడానికి, ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని గుర్తు చేశారు.
