గ్రామానికే అధికారులు..
గ్రామానికే అధికారులు..
45 అర్జీల స్వీకరణ.. శాశ్వత పరిష్కారాలకే ప్రాధాన్యం
ఏలూరు/నిడమర్రు, ఆంధ్రప్రభ: ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శనివారం నిడమర్రు మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మూడో విడత కార్యక్రమంలో ఆయన, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సంయుక్తంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మొత్తం 45 అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుడైన ఓ అర్జీదారు వద్దకు స్వయంగా వెళ్లిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే అతని సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాన్ని స్వీకరించారు.
కార్యక్రమానికి ముందు గత రెండు వారాల్లో అందిన అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పరిష్కారంలో వెనుకబడిన శాఖల అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేస్తూ, గ్రామస్థాయిలో సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా డా. ఎం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ, ప్రజలు తమ గ్రామంలోనే అధికారులను నేరుగా కలుసుకుని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది చక్కని వేదిక అని అన్నారు. అందిన అర్జీలను పారదర్శకంగా పరిష్కరించాలని, పరిష్కారం కాని అంశాలపై అర్జీదారులకు స్పష్టమైన కారణాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మూడు విడతలుగా నిర్వహించిన పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యల నివేదికలతో తదుపరి సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం అందించాలని కోరారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు గ్రామసభల్లో వచ్చిన ఫిర్యాదులకు నూరుశాతం పరిష్కారం చూపేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజాసమస్యలను పారదర్శకంగా పరిష్కరించి ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు సహకరించాలని అన్నారు.
అర్జీల్లో ప్రధాన వినతులు
నిడమర్రు గ్రామానికి చెందిన చింత రూపాదేవి తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరగా, బువ్వనపల్లి గ్రామానికి చెందిన వడ్డి శ్రీనివాస్ పూర్తిగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యానని, ప్రస్తుతం పొందుతున్న దివ్యాంగ పింఛన్‌ను రూ.15 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
అదే గ్రామానికి చెందిన గుణ్ణం ఆదిలక్ష్మి తన 47 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల్లో 22-ఏ జాబితాలో నమోదై ఉండటంతో బ్యాంకు రుణాలు మంజూరు కావడం లేదని న్యాయం చేయాలని కోరారు. నిడమర్రు గ్రామానికి చెందిన చెన్నం వెంకటసూర్యనారాయణ తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని వినతి సమర్పించారు.
ఈ సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి అర్హమైన అర్జీలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, తహశీల్దార్ గద్దె శ్రీధరుబాబు, ఎంపీడీవో జి. విజయకుమారి, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
