‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అడుగులు
‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి అడుగులు
ఆర్టీఐహెచ్లో 136 మందికి సామర్థ్య వృద్ధి శిక్షణ
విజయవాడ, ఆంధ్రప్రభ: పారిశ్రామికవేత్తల తయారీకి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మరింత ఊతమిస్తూ ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో నిర్వహించిన సామర్థ్య వృద్ధి కార్యక్రమం విజయవంతమైంది. ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, జిల్లా ఎంఎస్ఎంఈ శాఖల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 136 మంది పాల్గొని వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్, డిజిటల్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై సమగ్ర అవగాహన పొందారు.
ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈఓ జి. కృష్ణన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యాన్ని సాధించడంలో మహిళలు, యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ఆర్టీఐహెచ్ అందిస్తున్న సేవలు, శిక్షణా కార్యక్రమాలను వివరించారు.
కార్యక్రమంలో ఈ-కామర్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ట్రేడ్‌మార్క్ ప్రాముఖ్యత, జీఎస్టీ ప్రయోజనాలు, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ విస్తరణ వ్యూహాలపై నిపుణులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే ఆర్థిక, సాంకేతిక అవకాశాలను వినియోగించుకోవడంపై ప్రత్యేక మార్గదర్శకాలు అందించారు.
శిక్షణా కార్యక్రమానికి అనుబంధంగా నిర్వహించిన నమోదు ప్రక్రియల్లో 7 జీఎస్టీ నమోదులు, 7 స్టార్టప్ నమోదులు, 12 వాల్‌మార్ట్ ఎల్ఎంఎస్ నమోదులు, ఒక ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ ఆన్‌బోర్డింగ్, 4 ఉద్యమ్ నమోదులు పూర్తయ్యాయి. దీంతో శిక్షణతో పాటు ప్రత్యక్ష వ్యాపార అవకాశాల కల్పనలో కూడా కార్యక్రమం ఫలవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
వన్-టు-వన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వ్యాపార ప్రణాళిక, బ్రాండ్ నిర్మాణం, మార్కెటింగ్ వ్యూహాలు, వ్యాపార విస్తరణ, పెట్టుబడి అవకాశాలపై వ్యక్తిగత సూచనలు అందించారు. ఈ మార్గదర్శకాలు భవిష్యత్ వ్యాపారాభివృద్ధికి దోహదపడనున్నాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. మురళీకృష్ణ ప్రసాద్, జి.ఎస్. సుజాత, ఎస్. సుజాతరాణి, టెక్నికల్ నిపుణులు, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, వాల్‌మార్ట్ ప్రతినిధులు, ఐపీఆర్ అటార్నీలు, ఆర్టీఐహెచ్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పారిశ్రామికవేత్తల అభివృద్ధి, ఇన్నోవేషన్, ఎంఎస్ఎంఈల వృద్ధికి ఆర్టీఐహెచ్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని పాల్గొన్నవారు అభినందించారు.
