రైల్వే, జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగవంతం

  • భూసేకరణ, పెండింగ్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
  • పీజీఆర్ఎస్, రీ-సర్వే, 22ఏ కేసులకు మొదటి ప్రాధాన్యత
  • డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై దృష్టి
  • నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులు, భూసేకరణ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పీజీఆర్ఎస్ ఫిర్యాదులు, రీ-సర్వే, 22ఏ నిషేధిత జాబితా కేసుల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంగళవారం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులతో కలిసి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, భూసేకరణ, పెండింగ్ భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, వైజాగ్-చెన్నై కారిడార్ పైప్‌లైన్ పనులు, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, దుగ్గరాజపట్నం, శ్రీ సిటీ, ఎల్జీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ తదితర సంస్థలకు సంబంధించిన భూసేకరణ అంశాలను సమీక్షించారు.

ఆటంకాలు లేకుండా చూడాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ సిటీ ఫేజ్-2, ఎల్జీ ఫేజ్-1, 2, 3, రాయల్ ఎన్‌ఫీల్డ్, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, నాయుడుపేట ఫేజ్-2, వానెల్లూరు, పాగలి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రాజెక్టుల పురోగతికి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ నడికుడి – శ్రీకాళహస్తి, ఏర్పేడు – పూడి, గుమ్మిడిపూండి – గూడూరు, గూడూరు – రేణిగుంట, తిరుపతి – కాట్పాడి, తిరుపతి – పాకాల, అరక్కోణం – రేణిగుంట మార్గాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే నాయుడుపేట –రేణిగుంట, రేణిగుంట – కడప, రేణిగుంట – చెన్నై రహదారి విస్తరణ పనులు, ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

సమన్వయంతో పనిచేయాలి
సాగరమాల కింద చేపట్టిన జాతీయ రహదారి ప్యాకేజీ-2, 3, 4 పనులను రెవెన్యూ, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎయిర్‌పోర్టు, ఇస్సర్, కరకంబాడి, ఎంఐజీ లేఅవుట్, తిమ్మాజికండ్రిగ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జల వనరులు, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. రీ-సర్వే కార్యక్రమాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి భూ యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.

త్వరితగతిన పరిష్కారం
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేసి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని వేగవంతం చేసి ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల ఇంజినీర్లు, ఏపీఐఐసీ అధికారులు, రైల్వే ప్రాజెక్టు అధికారులు, జాతీయ రహదారుల శాఖ ప్రతినిధులు, తహసీల్దార్లు, భూసేకరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.