డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం

వ్యర్థాలను వనరులుగా మార్చే దిశగా చర్యలు..

రూ.1,300 కోట్లతో లెగసీ వ్యర్థాల తొలగింపు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

కాణిపాకం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి మండలంలో స్వచ్ఛ రథాలు నిరంతరం తిరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని స్వచ్ఛ (స్వర్ణ) ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్న అనంతరం అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన దిశగా వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

లెగసీ వ్యర్థాల తొలగింపుకు రూ.1,300 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎనిమిది వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లతో పాటు కంపోస్ట్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా సేంద్రియ ఎరువులు అందించే చర్యలు కూడా చేపడుతున్నామని, వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

చిత్తూరు జిల్లా స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధిస్తోందని ప్రశంసించిన ఆయన, జిల్లాలో ఇప్పటివరకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ రథాల ద్వారా ఇంటింటి నుంచి తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరిస్తున్నామని, ఇందుకు ప్రోత్సాహకంగా నిత్యావసర వస్తువులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు సేకరించిన చెత్తను అదే రోజు శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి నిర్వహిస్తున్నామని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలు పేరుకుపోయాయని, చిత్తూరు పట్టణంలోనే 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 1.50 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. ప్రస్తుతం వాటిని బయో మైనింగ్ విధానంలో తొలగించేందుకు రూ.16 కోట్లతో పనులు చేపట్టామని, సిగ్మా సంస్థ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

చిత్తూరు డంపింగ్ యార్డుకు శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం అక్కడ ఉన్న సుమారు 1.60 లక్షల టన్నుల పాత చెత్తను శాస్త్రీయంగా తొలగిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పూర్తిగా పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా అందమైన పార్కుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అలాగే రూ.8 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా భవిష్యత్తులో డంపింగ్ అవసరం లేకుండా వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు, ఎనిమిది వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలో ప్లాంట్లు పనిచేస్తుండగా, కడప, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, తిరుపతిలో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి సమీపంలో డ్రై వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ప్రత్యేక రిక్లమేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వర్షపు నీటి పారుదల వ్యవస్థలు, ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారాల దిశగా సమగ్ర కార్యాచరణ చేపట్టామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి అందిస్తే పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణం మరింత వేగంగా సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.