మినీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

మినీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ:
మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుపతి మారుతి నగర్, కోర్లగుంటకు చెందిన కె. వేణుగోపాల్ రెడ్డి (82) సోమవారం తెల్లవారుజామున బస్టాండ్‌కు బయలుదేరారు.

పెన్షన్ కోసం తన సొంత ఊరైన అయ్యన్నగారిపల్లి, అమ్మగుంట గ్రామానికి వెళ్లేందుకు మేనల్లుడు గణేష్‌తో కలిసి ఆయన బయలుదేరారు. టీఎంసీ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతుండగా, పూర్ణకుంభం సర్కిల్ నుంచి టీటీడీ పరిపాలన భవనం వైపు వెళ్తున్న శ్రీ నిజ ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు వేగంగా వచ్చి వేణుగోపాల్ రెడ్డిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వృద్ధుడు రోడ్డుపై పడిపోయాడు. బస్సు వెనుక టైరు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు శివనారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ముని శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Leave a Reply