జేఈఈ అడ్వాన్స్డ్‌లో సత్తా చాటిన గుడిహత్నూర్ విద్యార్థి

గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశిష్ట ర్యాంకు సాధించిన గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి ముండే ఓం ప్రసాద్‌ను పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. స్థానిక పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ కుమారుడైన ఓం ప్రసాద్ సాధించిన ఈ విజయంపై ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన స్వామి, మీడియా మిత్రులు, బోత్ ఐ న్యూస్ రిపోర్టర్ దిగంబర్ తదితరులు అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి విద్యార్థిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి కఠినమైన జాతీయ స్థాయి పరీక్షలో విజయం సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఓం ప్రసాద్ సాధించిన విజయం మండలానికి గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆయన నిరూపించారని అన్నారు. సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ముండే ఓం ప్రసాద్, తన విజయానికి ప్రధాన కారణం తండ్రి ముండే సంజీవ్ గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, నిరంతర సహకారమేనని తెలిపారు.

ప్రతి దశలో తనకు అండగా నిలిచి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిన తండ్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. జేఈఈ అడ్వాన్స్డ్‌లో ఓం ప్రసాద్ సాధించిన విజయం గుడిహత్నూర్ మండలానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.

Leave a Reply