Eco Friendly Lifestyle | బిజీ లైఫ్‌కు బైబై…

Eco Friendly Lifestyle | బిజీ లైఫ్‌కు బైబై…
- ప్రశాంతమైన, అందమైన జీవితం మీ సొంతం!
ప్రస్తుత టెక్ యుగంలో అందరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్… డబ్బుల వెనుక పరుగులు పెడుతూ.. తెలియకుండానే చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇక దానికితోడు మహానగరాల్లో ఉన్న పెరిగిపోతున్న పొల్యూషన్.. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత కరువయ్యాయి.
ఇలాంటి గజిబిజి పరుగుల లోకానికి దూరంగా.. ఎక్కడైనా కాస్త భూమి కొనుగోలు చేసి, ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే, దానికి వందల ఎకరాల భూమి ఉండాల్సిన అవసరం లేదు. తక్కువలో తక్కువ కేవలం పావు కరం భూమి ఉంటే చాలు!
చిన్నపాటి ప్లానింగ్‌తో ప్రకృతికి, ఆరోగ్యానికి దగ్గరగా అద్భుతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. పావు ఎకరం స్థలంలోనే ఒక సంపూర్ణమైన, స్వయంసమృద్ధి గల జీవనశైలిని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
- వెజిటేబుల్ గార్డెన్ (2000 స్క్వేర్ ఫీట్స్)
మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన కూరగాయలకు గుడ్‌బై చెప్పేయొచ్చు. కేవలం 2000 చదరపు అడుగుల స్థలంలో ఒక చక్కని వెజిటేబుల్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీ కుటుంబానికి సరిపడా టమాటా, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఆకుకూరలను ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడే పండించుకోవచ్చు. - పండ్ల తోట, హెర్బ్స్ గార్డెన్ (1000 స్క్వేర్ ఫీట్స్)
ఒక 1000 చదరపు అడుగుల స్థలాన్ని పండ్ల చెట్లకు కేటాయించవచ్చు. జామ, నిమ్మ, బొప్పాయి, అరటి వంటి త్వరగా కాపుకు వచ్చే చెట్లను నాటుకోవచ్చు. దీనితో పాటు వంటల్లో రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పుదీనా, కొత్తిమీర, తులసి, కలబంద వంటి వివిధ రకాల హెర్బ్స్ (మూలికలు) కూడా పెంచుకోవచ్చు. - చిన్న లైవ్ స్టాక్ (చిన్నపాటి పశుపోషణ)
ఆహారంతో పాటు అదనపు ఆదాయం కోసం కొంత స్థలంలో చిన్నపాటి కోళ్ల ఫారమ్, ఒకట్రెండు మేకలను పెంచుకోవచ్చు. దీనివల్ల ప్రతిరోజూ కెమికల్స్ లేని స్వచ్ఛమైన దేశీ గుడ్లు, పాలు ఇంటికే అందుతాయి. అవసరానికి మించి ఉంటే వాటిని విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. - కంపోస్టింగ్.. మట్టి బలం… మంచి పంట!
బయట నుంచి కొనే ఖరీదైన ఎరువుల అవసరం లేకుండా.. పశువుల పేడ, కోళ్ల వ్యర్థాలు, ఇంట్లో మిగిలిపోయే తడి చెత్తను ఉపయోగించి సొంతంగా ‘కంపోస్ట్’ (సేంద్రీయ ఎరువు) తయారు చేసుకోవచ్చు. ఇది మట్టి బలాన్ని పెంచి, పంటలు ఏపుగా పెరగడానికి సహాయపడుతుంది. - ఎనర్జీ & ఫ్యూయల్ (సోలార్ పవర్)
కరెంట్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవడానికి ఇంటిపై లేదా ఖాళీ స్థలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల తక్కువ కరెంట్ బిల్లుతో పాటు, ప్రకృతి సిద్ధమైన పునరుత్పాదక ఇంధనాన్ని వాడుకున్న తృప్తి లభిస్తుంది. కాస్త శ్రమ పడితే, తక్కువ పెట్టుబడితోనే ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
